వారసులకు షాక్ ఇస్తున్న జగన్...?
వైసీపీలో వారసులకు నో టికెట్ అన్న రూల్ అప్లై చేయాలని అధినాయకుడు జగన్ చూస్తున్నారని ప్రచారం సాగుతోంది
వైసీపీలో వారసులకు నో టికెట్ అన్న రూల్ అప్లై చేయాలని అధినాయకుడు జగన్ చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. అదే ప్రత్యర్ధి పార్టీ టీడీపీలో అయితే నలభై శాతం యూత్ కి అంటూ రిజర్వ్ చేశారు. ఆ యూత్ ఎవరో కాదు వారసులే అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీలో వారసులు ఈసారి చాలా మంది కనిపించే అవకాశం ఉంది.
కానీ వైసీపీలో మాత్రం వారసులకు టికెట్లు వద్దు అనే మాట ఉంది. జగన్ ఈ విషయంలో కఠినంగానే ఉంటున్నారు అని అంటున్నారు. అసలు ఎందుకు ఈ రకంగా నిర్ణయం అన్నది చర్చకు వస్తోంది. వైసీపీ పెట్టాక రెండు ఎన్నికలను మాత్రమే ఎదుర్కొంది. అదే టీడీపీ పుట్టి నాలుగు దశాబ్దాల కాలం అయింది. ఇక వైసీపీలో అంతా నడి వయసు వారు, యూత్ ఎక్కువగా ఉన్నారు. టీడీపీలో అయితే ఆరున్నర పదుల వయసు దాటిన వారే 2019 ఎన్నికల దాకా కనిపించారు.
అందువల్లనే టీడీపీ యూత్ వైపు పరుగులు పెడుతూంటే వైసీపీ ఆ పరిస్థితి ఏదీ మనకు లేదు అని అనుకుంటోంది. ఇంకో వైపు చూస్తే బాగా సీనియర్లు వైసీపీలో ఉన్న వారి సంఖ్య తక్కువ వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇస్తారా లేదా అన్నది మరో చర్చ. ఇంకో వైపు చూస్తే వారసుల పేరుతో చాలా మంది నాయకులు టికెట్లు అడుగుతున్నారు. దాంతో వారికి ఇస్తే వీరికి కోపం అలక. అలాగే వివాదాలు వర్గ పోరు కొత్తగా స్టార్ట్ అవుతుంది అని భావించారో ఏమో కానీ నో టికెట్ వారసత్వానికి అని ఒక కచ్చితమైన నియమాన్ని జగన్ పెట్టుకున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే టికెట్లు తమ వారసులకు ఇవ్వాలని కోరుతున్న వారి జాబితా వైసీపీలో అయితే కొండవీటి చాంతాడు అంతలా ఉంది అని అంటున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్లు ముఖ్యమంత్రితో సంప్రదిస్తున్నారు అని అంటున్నారు. వారికి జగన్ ఏమె చెప్పడంలేదు కానీ వారసులకు టికెట్ ఇవ్వకూడదు అన్నదే పార్టీ విధానం అంటున్నారు.
ఇక వారసులకు టికెట్లు ఆశిస్తున్న వారి జాబితాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీన్వాస్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, యెమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. వీరంతా తమ బిడ్డలకు టికెట్లు అడుగుతున్నారు.
అదే విధంగా రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు కూడా తమ పిల్లలకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని టాక్ గట్టిగా నడుస్తోంది. ఇంకో వైపు చూస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, పినిపే విశ్వరూప్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి టికెట్ తమ వారికి ఇవ్వాలని పట్టు పడుతున్నారని ప్రచారం అయితే ఉంది.
కానీ జగన్ ఆలోచన వేరుగా ఉంది అని అంటున్నారు. పార్టీలో వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించబోమని, సీనియర్లు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జగన్ వారికి తేల్చిచెప్పినట్లు సమాచారంగా ఉంది. అంతే కాదు సీనియర్లలో కొందరిని ఈసారి లోక్‌సభ ఎన్నికలకు బరిలోకి దింపినా లేక పార్టీ పనిలో అప్పగించినా వారి వారసులకు మాత్రం పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి జగన్ ఇష్టపడటం లేదని అంటున్నారు.
అయితే కొన్ని అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే రెండు లేదా మూడు అభ్యర్థనలను జగన్ పరిగణనలోకి తీసుకోవచ్చు అని అంటున్నారు. అది కూడా ఆయన చోట్ల వారసుల గెలుపు అవకాశాలను అంచనా వేసిన తర్వాత మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అసలు జగన్ ఈ రకంగా ఆలోచనలు చేయడం వెనక కొత్త నెత్తురు ఎప్పటికపుడు పార్టీకి అందించడంతో పాటు సామాజిక న్యాయం విధానంగా తీసుకోవడం వంటివి ఉన్నాయని అంటున్నారు. అందువల్ల ఆయన చోట్లా ఒకే కుటుంబం కానీ ఒకే నాయకుడు కానీ ఉండకుండా అందరికీ అవకాశాలు వైసీపీలో ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి.