జగన్ నా సోదరుడు.. ఆయనే గెలుస్తాడు : కేటీఆర్
గుర్రం కడుపులో గుడ్డులా ఎన్నికలైతే జరిగాయి కానీ ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో మూడు కూటములు పోరాడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి, జగన్ వైసీపీ లు సమ ఉజ్జీలుగా ప్రచారం నిర్వహించాయి. గెలుపు తమదే అంటే తమదే అని చెబుతున్నాయి. గుర్రం కడుపులో గుడ్డులా ఎన్నికలైతే జరిగాయి కానీ ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. దీంతో విజయం తమదంటే తమదే అని ఢంకా బజాయిస్తున్నాయి.
ఈనేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీలో ఎన్నికల గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. జగన్ తనకు సోదరుడితో సమానం. అక్కడ జగనే గెలుస్తాడని చెబుతున్నారు. ఆయన పాలన అంటే తనకు ఇష్టమంటున్నారు. ఏపీలో జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎన్నోరకాలుగా మేలు చేశాయని చెబుతున్నారు. అందుకే తనకు జగన్ అంటేనే ఇష్టమని తన మనసులోని మాట బయట పెట్టారు.
జగన్ కు కేసీఆర్ కు కూడా మంచి దోస్తీ ఉంది. ఇద్దరు పరస్పరం రాష్ట్ర సంబంధాల్లో చేదోడు వాదోడుగానే నిలిచారు. కొద్ది రోజులు షర్మిల ఇక్కడ రాజకీయం చేయడంతో ఇద్దరి మధ్య కాస్త వైరం పెరిగినట్లు కనిపించినా ప్రస్తుతం మళ్లీ పాత దోస్తీ పట్టాలేసుకుంటోంది. దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకునే స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పాలన అంటే తనకు ఇష్టమనే కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. ఏ పనిచేసినా జగన్ ను ఆహ్వానించడం ఆయన ఏం చేసినా కేసీఆర్ ను పిలవడం ఓ మంచి స్నేహితులుగా మారిపోయారు. చంద్రబాబు అంటే మండిపడే కేసీఆర్, కేటీఆర్ జగన్ అంటే అభిమానం చూపించడం కొత్తేమీ కాదు. ఇది చాలా రోజులుగా వస్తున్నదే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు.
ఏపీలో జగనే గెలుస్తాడని కేటీఆర్ నమ్ముతున్నారు. ఆయన పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు. అందుకే జగన్ ను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలు మాత్రం టీడీపీ కూటమిదే విజయం అంటున్నాయి. కేటీఆర్ మాత్రం జగన్ గెలుస్తాడంటున్నారు. ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి మరి.