జగన్ కార్యక్షేత్రంగా బెంగళూరు ?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు తాజాగా ఆయన మరోసారి అక్కడికే వెళ్తున్నారని అంటున్నారు

Update: 2024-07-27 15:17 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు తాజాగా ఆయన మరోసారి అక్కడికే వెళ్తున్నారని అంటున్నారు. జగన్ అధికారం కోల్పోయాక బెంగళూరు నే తన రాజకీయ కార్యక్షేత్రంగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. బెంగళూరు జగన్ కి సొంత ఊరు లాంటిదే. జగన్ రాజకీయాల్లోకి రానపుడు బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు.

జగన్ అలా ముచ్చటపడి యెహలంక ప్యాలెస్ ని కట్టుకున్నారు. అది ఏకంగా ఇరవై ఏడు ఏకరాలలో విస్తరించి ఉందని చెప్పుకుంటారు. అంతటి విశాలమైన ప్యాలెస్ ని కట్టుకున్న జగన్ అక్కడ ఉన్నది బహు తక్కువ అని అంటారు. ఆయన కాంగ్రెస్ తరఫున కడప నుంచి 2009లో ఎంపీ అయ్యాక బెంగళూరు తో సంబంధాలు దాదాపుగా కట్ అయ్యాయి. ఆయన పదిహేనేళ్ల రాజకీయం అలా స్పీడ్ గానే సాగింది.

ఇపుడు ఆయన బెంగళూరులో ఉండేందుకు వీలు పడింది. అయితే జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం దేనికి అన్న చర్చ కూడా సాగుతోంది. బెంగళూరు లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వైఎస్సార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అని చెబుతారు. ఆయన చొరవ వల్లనే షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయింది అని కూడా ప్రచారంలో ఉంది.

అంతే కాదు డీకేను ట్రబుల్ షూటర్ గా చెబుతారు. డీకే దక్షిణాదిన కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెడతారు. అంగబలం అర్ధం బలంతో పాటు రాజకీయ వ్యూహాలు నిండుగా ఉన్న నాయకుడు ఆయన. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా డీకే తనదైన వ్యూహాలను రచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి అందరి ఆమోదం ఉండేలా ఆయన పావులు కదిపారు అని అంటారు.

ఇపుడు చూస్తే వైసీపీకి జాతీయ రాజకీయాల్లో అండ కావాలని అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో వైసీపీ చేరేందుకు చూస్తోంది అని ప్రచారం కూడా సాగుతోంది. ఏపీలో వైసీపీకి రాజకీయ దశ తిరగాలీ అంటే ఈ స్టెప్ వేయడం అనివార్యం అని అంటున్నారు. దాంతో డీకే ద్వారా ఏమైనా రాయబారాలు జరుగుతున్నాయా అన్న పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి.

అయితే గతంలోనే దీని మీద డీకే వివరణ ఇచ్చారు. జగన్ తనతో భేటీ కావడం అన్న వార్తలు ఫేక్ అని కూడా కొట్టి పారేశారు. అయితే బెంగళూరు కేంద్రంగా జగన్ చేస్తున్నది రాజకీయ వ్యూహ రచన అయితే మాత్రం డీకే తప్ప ఎవరూ కీ రోల్ ప్లే చేయలేరని అంటున్నారు.

కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా డీకేని పూర్తిగా విశ్వసిస్తుంది. దాంతో డీకే ద్వారానే ఏమైనా జరగాలి అన్నది కూడా ఉంది. ఈ క్రమంలో జగన్ బెంగళూరు తరచూ చేస్తున్న టూర్ల వెనక రాజకీయంగా మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ అలాంటిది ఏదీ లేదని వైసీపీ కూడా ఖండిస్తోంది.

అలాగే కాంగ్రెస్ వైపు నుంచి ఏమీ లేదని అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏమో బెంగళూరే ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేదిగా ఉండవచ్చు అంటే ఈవాళ కాకపోయినా రేపు అయినా అది నిజమవుతుందేమో చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News