త్యాగాల త్యాగరాజు.. పవన్ కు కొత్త పేరు పెట్టేసిన జగన్
త్యాగాల త్యాగరాజుగా ఆయన్ను అభివర్ణించిన సీఎం జగన్.."ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును ఎండగట్టారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆ వేదికపై నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ పై పలు పంచ్ ల్ని వేశారు. అంతేనా.. పవన్ కు సరికొత్త పేరు పెట్టేసిన సీఎం జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. త్యాగాల త్యాగరాజుగా ఆయన్ను అభివర్ణించిన సీఎం జగన్.."ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమైన ప్రజల్ని వంచించేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు.
భీమవరం సభలో తాను ఈ పట్టణ ప్రజలు రిజెక్టు చేసిన దత్తపుత్రితో మొదలు పెడతానన్న సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుష్ట చతుష్టయానికి చెందిన గ్యాంగ్ అంటూ మండిపడ్డారు. "ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు. నాన్ లోకల్. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండరు" అని మండిపడ్డారు.
బాబు ముఖ్యమంత్రి అయితే చాలు.. అవే నాకు వందల కోట్లు అని ఈ మనిషి అనుకుంటారన్న సీఎం జగన్.."బాబు కోసమే తన జీవితం అని.. అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని.. ఆ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు. తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఎవరినీ చూసి ఉండం. దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే. ఏ సీటూ ఇవ్వకున్నా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజు మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం" అని వ్యాఖ్యానించారు.
మనసు రాని ఒకాయన పరిపాలనను మనం చూశామంటూ చంద్రబాబుపై విరుచుకుపడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. "ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు సీఎంగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్లు వేశాడు. వీళ్లంతా కూడా అధికారంతో ఏం చేశారంటే.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలన చేయలేదు. దోచుకోవటం.. దాచుకోవటం.. పంచుకోవటం మాత్రమే జరిగాయి" అని నిప్పులు చెరిగారు.