జగన్ న్యూ స్లోగన్ : నేను 124 సార్లు...మీరు జస్ట్ రెండు సార్లు...!

ఎందుకంటే ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. ఇవి పేదల సంక్షేమానికి దానికి వ్యతిరేకంగా ఉన్న వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈవీఎం బటన్ నొక్కి వైసీపీకి ఓటేస్తేనే మీ పధకాలు దక్కుతాయి.

Update: 2024-02-03 16:22 GMT

ఏమిటీ లెక్క అని ఆనుకోకండి. ఇది ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ ఇచ్చిన పవర్ ఫుల్ న్యూ స్లోగన్. మీ కోసం మీ ఇంటికి సంక్షేమ పధకాలు అందించేందుకు నేను 124 సార్లు బటన్ నొక్కాను. నా కోసం మన ప్రభుత్వం కోసం మీ సంక్షేమ కోసం జస్ట్ రెండు సార్లు ఈవీఎం మిషన్ బటన్ నొక్కండి అంటూ జగన్ నినదించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరోసారి రావాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. ఇవి పేదల సంక్షేమానికి దానికి వ్యతిరేకంగా ఉన్న వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈవీఎం బటన్ నొక్కి వైసీపీకి ఓటేస్తేనే మీ పధకాలు దక్కుతాయి. మీ పేదరికం తీర్చే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుంది. అందుకే రెండు బటన్లు నొక్కండి ఒకటి ఎంపీ కోసం మరొకటి ఎమ్మెల్యే కోసం అంటూ జగన్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

వైసీపీ దెందులూరులో ఏకంగా ఆరు లక్షల మందికి పైగా పార్టీ శ్రేణులతో అతి పెద్ద రాజకీయ సభను నిర్వహించింది. ఇది గోదావరి ప్రాంతంలో రీ సౌండ్ చేసేలా సాగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అనేక విషయాలను పార్టీ క్యాడర్ తో పంచుకున్నారు. గత 57 నెలల కాలంలో 124 సార్లు బటన్‌ నొక్కడం ద్వారా పేదల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల 55వేల కోట్ల రూపాయల నగదుని జమ చేశామని జగన్ చెప్పారు.

ఈ లబ్దిని కులం మతం ప్రాంతం అన్నది చూడకుండా ప్రజలకు మొత్తంగా అందించామని జగన్ చెప్పారు. అందువల్ల పార్టీ క్యాడర్ అంతా ప్రజల వద్దకు వెళ్ళి వైసీపీ చేసిన ఈ మంచి గురించి చెప్పాలని జగన్ కోరారు. పేదల ప్రభుత్వం మరలా రావాలీ అంటే కచ్చితంగా వైసీపీకి ఓటేయాలని ఆయన కోరరు.

టీడీపీని ఈ సందర్భంగా జగన్ పసుపు వైరస్ గా పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే కనుక సంక్షేమ పధకాలు అన్నీ ఎత్తేసేందుకు వారికి పూర్తిగా లైసెన్స్ ఇచ్చినట్లే అని జగన్ గట్టిగా చెప్పారు. అంతే కాదు ఫ్యాన్ గుర్తుకు ఓటేయకపోతే చంద్రబాబు చంద్రముఖి రూపంలో మరోసారి వస్తారు అని ఆయన హెచ్చరించారు.

పేదల రక్తం పీల్చే డ్రాకులాగా బాబుని ఆయన అభివర్ణించారు. గాజు గ్లాస్ పట్టుకుని సైకిలెక్కి మరీ ప్రతీ పేదింటికీ వచ్చి రక్తం పీల్చేస్తారు అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రా కదలిరా అంటున్నది ప్రజలకు కాదని పొత్తుల కోసం పార్టీలని అని జగన్ అన్నారు.

ఇప్పటికే జనసేనను లాగేసిన బాబు మరో వైపు కమ్యూనిస్టులను కాంగ్రెస్ ని కూడా తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఈ విషయాలు అన్నీ చెప్పాలని జగన్ కోరారు. నేను అర్జునుడు అయితే పార్టీ క్యాడర్ క్రిష్ణ పాత్ర పోషిస్తుందని, సంక్షేమ పధకాలే ఆయుధంగా చేసుకుని జనంలోకి వెళ్ళి విజయ ఢంకా మోగిద్దామని ఆయన వైసీపీ క్యాడర్ ని హుషార్ పరచారు.

ఏపీలో గడచిన కాలంలో వైసీపీ ఏమి చేసింది అన్నది ప్రజలకు కార్యకర్తలు చెప్పాలని కోరారు. విద్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓడరేవులు, షిప్పింగ్ హార్బర్‌ల వంటి రంగాల్లో వైసీపీ ప్రభుత్వం అద్భుతాలు సాధించిందని అన్నారు. అంతే కాదు ప్రతీ గ్రామంలోని ప్రతి కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు జమ చేశారో క్యాడర్ వెళ్ళి మరీ ప్రజలకు అడగాలని గత చంద్రబాబు ప్రభుత్వంలో దీన్ని సరిపోల్చి మరీ వారికి వైసీపీ చేసిన మేలు ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.

విపక్ష నేతలుగా ఉనన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలను నాన్ రెసిడెంట్ ఆంధ్రులుగా జగన్ పేర్కొన్నారు. వారికి వైసీపీని దినడమే లక్ష్యం తప్ప మరేదీలేదని అన్నారు. జగన్‌కు ఓటు వేయకపోవడం అంటే పథకాలను రద్దు చేయడం, జన్మభూమి కమిటీలు తిరిగి రావడం అన్నది ప్రజలు అర్ధం చేసుకునేలా చెప్పాలని కోరారు.

ఇదిలా ఉంటే దెందులూరులోని కార్యకర్తలను స్వయంగా కలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాన్‌ ఆకారంలో ఉన్న ర్యాంపు గుండా వైఎస్‌ జగన్‌ నడిచారు. ర్యాంపుపై నిలబడి సెల్ఫీలు దిగేందుకు కూడా జగన్ అభిమానులను అనుమతించారు. మొత్తానికి జగన్ దెందులూరు సభ బాగానే సక్సెస్ అయింది అని అంటున్నారు.


Tags:    

Similar News