నాడు వైనాట్ 175...నేడు వై నాట్ అపోజిషన్ !?
కాలమహిమ ఇది అని జనాంతికంగా అనుకోవాలి. విధి అని సగటు మనిషి వేదాంతాన్ని అన్వయించుకోవాలి
కాలమహిమ ఇది అని జనాంతికంగా అనుకోవాలి. విధి అని సగటు మనిషి వేదాంతాన్ని అన్వయించుకోవాలి. జగన్ పరిభాషలో చెప్పుకోవాలీ అంటే దేవుడి స్క్రిప్ట్ అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే వైసీపీ అధినేత జగన్ ఎక్కడ నుంచి ఎక్కడికి పయనం చేస్తున్నారు అని అనిపించక మానదు.
ఇక చూస్తే 2024 ఎన్నికలలో వైసీపీ ఇచ్చిన పవర్ ఫుల్ స్లోగన్ ఏంటి అంటే వై నాట్ 175. అంటే ఏపీలోని మొత్తం అసెంబ్లీ సీట్లను తామే కైవసం చేసుకుని అసలు అపొజిషన్ అన్నదే లేకుండా చేయాలని వైసీపీ రాజకీయ అత్యాశకు పోయింది.
ప్రజలు అంతా తమ ప్రక్షమే కాబట్టి ప్రతిపక్షం అన్నది ఉండబోదని కూడా కలలు కన్నది. కానీ విధి అన్నది ఒకటి ఉందని నిరూపిస్తూ సీన్ ని రివర్స్ చేసి పారేసింది. అలా వైసీపీ విపక్షం లేకూడదు అనుకుంటే వైసీపీకే విపక్ష హోదా లేకుండా చేస్తూ జనాలు అత్యంత కఠినమైన తీర్పు ఇచ్చారు.
మొత్తం శాసనసభలో ఉన్న 175 సీట్లలో పది శాతం సీట్లు కూడా తెచ్చుకోలేక వైసీపీ కుప్పకూలింది. జస్ట్ 11 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నది జగన్ కి లేకుండా పోయింది. ఇది నిజంగా బాధాకరమే. దాంతో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన తొలుత స్పీకర్ కి లేఖ రాశారు.
అయితే అక్కడ స్పందన లేకపోవడంతో జగన్ ఇపుడు న్యాయ స్థానం గడప తొక్కారు. ఏపీలో వైసీపీకి అపోజిషన్ సీటు ఇవ్వాలని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అందులో ఆంధ్ర ప్రదేశ్ జీతాలు పెన్షన్ చెల్లింప సెక్షన్ 12-భ్ ప్రకారం తనను శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలని ఆ మేరకు ఏపీ అసెంబ్లీకి ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరుతూ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
అంతే కాదు అనర్హత తొలగింపు చట్టం 1953 సంబంధించి శాసన సభ కార్యదర్శి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ లా లెజిస్లేటివ్ వ్యవహారాలు, అలాగే, అసెంబ్లీ స్పీకర్ శాసనసభ వ్యవహారాల మంత్రికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్ లో జగన్ కోరారు.
ఇక ఈ రిట్ పిటిషన్ చూస్తే కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వం, అలాగే స్పీకర్ వైసీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను నిరాకరించడం ద్వారా వారు వైసీపీ గొంతుకను అసెంబ్లీలో నొక్కేందుకు జగన్ పిటిషన్‌లో వివరించారు.
ఈ రిట్ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది. దీని మీద ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు కానీ జగన్ అయితే తనకు ప్రతిపక్ష హోదా కావాలని గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కొత్త చర్చను రేపుతున్నాయి. అసలు విపక్షమే అన్నది లేకుండా వైసీపీని గెలిపించాలని రాజకీయంగా ఏ పార్టీ కోరని కోరినకు జగన్ కోరారు. జనం దాన్ని తిరస్కరించారు. అంతే కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.
ఇలా ప్రజల తీర్పు ప్రజా స్వామ్యంలో అత్యంత కఠినంగా వచ్చింది. అయినా సరే తనకు హోదా కావాలని జగన్ వాదిస్తూ కోర్టుల దాకా వెళ్తున్న తీరుని చూసిన వారు ఆనాడు వై నాట్ 175 అన్న స్థితి నుంచి ఈనాడు వై నాట్ అపొజిషన్ అన్న స్థితికి రావడం జగన్ రాజకీయ జీవితంలో అతి పెద్ద పాతాళానికి జారిన వైనం గానే చూస్తున్నారు. దీనిని ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్నారు.