కేసీఆర్ తో జగన్ భేటీ.. మరి రేవంత్ తో ఎప్పుడో?
తెలుగు రాజకీయాలు లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరింత ముదురుతున్నాయి
తెలుగు రాజకీయాలు లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరింత ముదురుతున్నాయి. అటు ఏపీలో కొత్త సంవత్సరం వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇక గత రెండు ఎన్నికల్లో అసెంబ్లీలో బోణీ కొట్టలేకపోయిన కాంగ్రెస్.. వైఎస్సార్టీపీని విలీనం చేసుకుని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి దింపి ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాల మధ్య.. ఏపీ సీఎం వైఎస్ జగన్ అనూహ్యంగా గురువారం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.
మర్యాదపూర్వకమే అయినా..
కేసీఆర్ డిసెంబరు 3న వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు వెళ్లి అక్కడ కిందపడి తుంటి గాయానికి గురైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన హైదరాబాద్ నందినగర్ లోని ఇంట్లో కోలుకుంటున్నారు. దీనికిముందు ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఉండగా పరామర్శల తాకిడి నెలకొంది. ఓ దశలో తనను చూసేందుకు ఎవరూ రావొద్దని కోరారు. డిశ్చార్జి అనంతరం కూడా ఆయన ఎవరినీ కలవడానికి మొగ్గు చూపడం లేదు. నందినగర్ లోని ఇంట్లో ఉంటున్నకేసీఆర్ ను కొద్దిమంది నాయకులు మాత్రమే కలిసినట్లు సమాచారం.
జగన్ వచ్చారు.. చూశారు..
అనూహ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం కేసీఆర్ ను పరామర్శించారు. గత ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ సహకారం అందించారని అందరూ అంటుంటారు. జగన్ సీఎం అయ్యాక కూడా తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ తో సమన్వయంతో కదిలారు. కాగా, ఎన్నికల అనంతరం కేసీఆర్ అనూహ్యంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటుండగా.. జగన్ పరామర్శకు రావడం గమనార్హం. వీరిద్దరూ గంట సేపు మాట్లాడుకున్నారని సమాచారం.
మరి రేవంత్ తో భేటీ ఎప్పుడు?
ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో జగన్.. రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపినట్లు కూడా మీడియాలో రాలేదు. కాగా, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటివరకు మర్యాదపూర్వకంగా కూడా మాట్లాడుకున్నట్లు బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి, జగన్ మధ్య మర్యాద కొద్దీ భేటీ కూడా జరగలేదు.
అసలు అవకాశం ఉంటుందా.?
రేవంత్ –జగన్ మధ్య భేటీకి అసలు అవకాశం ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. రెండు భిన్న పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరి మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ సత్సంబంధాలు లేవు. ఇక మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. వాటిలో జగన్ మరోసారి గెలిస్తే రేవంత్ తో భేటీకి అవకాశం ఉంటుంది. అలాకాకుండా జగన్ పరాజయం పాలైతే ఆ ప్రశ్నే రాదు. అందులోనూ జగన్ మళ్లీ గెలిస్తే వచ్చే నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రేవంత్ తో భేటీ అయ్యే సందర్భం కచ్చితంగా వస్తుంది.