పవన్ సవాలుకు జగన్ సై అనగలరా?
ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నుంచి జగన్ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ విసిరిన సవాలుకు జగన్ స్పందిస్తారా?
ఏపీ రాజకీయాలు కొత్త పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కళ్యాణ్ విస్పష్ట ప్రకటన చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్.. బాలయ్య, లోకేశ్ లతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అంతకుముందు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణిలను పవన్.. బాలయ్య, లోకేశ్ లతో కలిసి పరామర్శించారు.
చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జనసేనకు దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీ గురించి వాళ్లకెందుకు అని పవన్ ప్రశ్నించారు. అలాగయితే తాను జగన్ ను అమలాపురం నుంచో, రాజమండ్రి రూరల్ నుంచో పోటీ చేయమంటానని ఆయన పోటీ చేస్తారా అని పవన్ ఎద్దేవా చేశారు.
1978 నుంచి కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ జగన్ కుటుంబం నెగ్గుకుంటూ వస్తోంది. పులివెందుల నుంచి 1978లో తొలిసారి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1985 ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. ఇక 1989లో వైఎస్సార్ కడప నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో 1989 ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
1994లోనూ వివేకానే గెలుపొందారు. ఇక 1999, 2004, 2009ల్లో వైఎస్సార్ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక వైఎస్సార్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి విజయమ్మ గెలుపొందారు. మళ్లీ 2011లో వైసీపీ స్థాపించాక విజయమ్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇక 2014, 2019ల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి గెలుపొందారు.
అంటే దాదాపు 50 ఏళ్ల నుంచి పులివెందుల వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది. తొలిసారి 2014లో వైఎస్ విజయమ్మ కడప జిల్లా దాటి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయగా లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నుంచి జగన్ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ విసిరిన సవాలుకు జగన్ స్పందిస్తారా? కడప జిల్లా దాటి వేరే జిల్లాలో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో పోటీ చేసి గెలవగలరా అనేది హాట్ టాపిక్ గా మారింది.