జగన్ సంచలన నిర్ణయం.. ఎన్నికలకు ముందు ఇదో డేరింగ్ స్టెప్...!
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యూహం తోనే ఆయన ముందుకు కదిలారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యూహం తోనే ఆయన ముందుకు కదిలారు. అయితే.. అన్ని వ్యూహాలు... రాజకీయ పరమైన నిర్ణయాలే ఉండాలని లేదు.. కొన్ని కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా రాజకీయంగా ఆయా పార్టీలకు మేలు చేస్తుంటాయి. ఇలాంటి నిర్ణయమే జగన్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. ఆ క్రమంలో తాజాగా బుధవారం రాత్రి చాలా పొద్దు పోయాక తీసుకున్ననిర్ణయం.. పార్టీలో చర్చనీయాంశం అయింది.
కొన్ని దశాబ్దాలుగా కీలక డిమాండ్‌గా ఉన్న కాలేజీల ఏర్పాటుపై.. బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ రెండేసి చొప్పున జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు.. ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేసే రెండు కాలేజీల్లో ఒక్కటి ఖచ్చితంగా బాలికలకు కేటాయించింది. రెండోది.. బాలురు, బాలికలకు కలిపి ఉండనుంది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 685 మండలాల్లో 1370 కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
అంతేకాదు.. ఆయా కాలేజీలకు.. వచ్చే నెల 3లోగా భూమి పూజ చేయనున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. `ఇప్పటికే కాలేజీల నిర్మాణాలకు సంబంధించిన భూములను కలెక్టర్లు ఎంపిక చేశారు` అని ప్రభుత్వం తెలిపింది. వీటిలో అధునాతన వసతులతో కాలేజీలను నిర్మించనున్నట్టు పేర్కొంది. ఫలితంగా సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇక, బాలికల ఉన్నత విద్య మధ్యలోనే నిలిచిపోకుండా ఉంటుందని తెలిపింది.
కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా ప్రజలను ప్రభావితం చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ.. కాలేజీలు ఏర్పాటు చేయాలనే ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ప్రస్తుతం 685 మండలాలకు గానుకేవలం 118 మండలాల్లోనే కాలేజీలు ఉన్నాయి. అవి కూడా ఒక్కటే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఇటు ప్రభుత్వ పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా వైసీపీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు.