ఎన్నికలకు వలంటీర్లను దూరం పెట్టండి: జగన్ సంచలన ఆర్డర్
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చూచాయగా. . వలంటీర్లను కొన్ని విధులకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది.
ఎన్నికల నోటిఫికేషన్ మరి కొన్ని గంటల్లోనే రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన హయాంలో ప్రభుత్వానికి కళ్లు కాళ్లు అన్నట్టుగా మారిపోయిన వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ.. సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చూచాయగా. . వలంటీర్లను కొన్ని విధులకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ.. అన్ని విధులకు వారిని వాడేస్తున్నారు. అదేమంటే షెడ్యూల్ ఇంకా రాలేదుగా అని సెలవిస్తున్నారు.
కానీ, ఇంతలోనే ఏమైందో ఏమో.. వైసీపీ ప్రభుత్వం ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వలంటీ ర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మెమో జారీ చేశారు. ఏ విధమైన ఎన్నికల విధుల్లోనూ వలంటీర్లు పాలుపంచుకోకుండా చూడాలని ఆదేశించారు.
వలంటీర్లను అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించుకోకూడదని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఈ ఆదేశాలను మీరితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎన్నికల విషయంలో వలంటీ ర్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఇదిలావుంటే, ఇలా తామే ముందుగా నిర్ణయం తీసుకుంటే.. రేపు ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదనే ఎత్తుగడ కూడా ఉండి ఉంటుందనే భావన ఉంది.
ఎందుకంటే.. రేపు ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకుంటే మొత్తానికే మోసం వస్తుంది. సో.. కాబట్టి.. ఎన్నికల విధులకు మాత్రం వలంటీర్లను దూరం పెట్టేయడం మంచిదనిభావించి ఉంటారనే చర్చ సాగుతోంది. అయితే.. ఇప్పుడు వలంటీర్లను ఏమీ సుప్త చేతనావస్థలో ఉంచరు. వీరిని ప్రచారానికి వాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇంటింటికీ వారిని పంపించి.. ఓరల్ ప్రచారానికి కూడా అవకాశం కల్పించే చాన్స్ ఉంటుంది. అయినప్పటికీ అది ఎన్నికల డ్యూటీ కాదు కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉందని అధికార పార్టీ అంచనా వేసి ఉంటుందని తెలుస్తోంది.