విశాఖ మీద జగన్ కి అంత మోజెందుకు ?
తాజాగా ఒక ప్రముఖ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ విశాఖ మీద తనకు ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యాంకర్ సూటిగా ఒక ప్రశ్న సంధించారు.
ఏపీలో 151 సీట్లతో వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన మనసులో మాటను బయటపెట్టేసుకున్నారు. విశాఖని పరిపాలనా రాజధానిగా చేసుకుని ముందుకు సాగుతామని ఆయన 2019 శీతాకాల సమావేశాలలోనే కుండబధలు కొట్టారు. అలా మూడు రాజధానుల నినాదం ఆయన వినిపించారు.
అయితే అది కాస్తా కోర్టు వివాదాలలో చిక్కుకుంది. అయితే మాత్రం జగన్ పట్టుదల అలాగే ఉంది. ఈసారి మళ్ళీ తానే సీఎం అవుతాను అని కడు నిబ్బరంగా చెబుతున్న జగన్ జూన్ 4 ఫలితాల తరువాత సీఎం గా విశాఖలోనే ప్రమాణం చేస్తాను అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
తాజాగా ఒక ప్రముఖ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ విశాఖ మీద తనకు ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యాంకర్ సూటిగా ఒక ప్రశ్న సంధించారు. విశాఖ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ. దాని వెనక కారణాలు ఏమిటి అని అడిగారు. విశాఖలోనే 2014 ఎన్నికల్లో మీ తల్లిగారు విజయమ్మ ఎంపీగా పోటీ చేస్తే ఓడించారు. అక్కడ వైసీపీకి రాజకీయంగా కూడా బలం తక్కువ.
అలాంటి చోట ఎందుకు ఉండాలనుకుంటున్నారు. విశాఖనే పదే పదే ఎందుకు తలుస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి జగన్ జవాబు చెబుతూ ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం విశాఖ మాత్రమే. ఎవరైనా ఈ రియాలిటీని ఒప్పుకుని తీరాల్సిందే అని అన్నారు. విశాఖను రాజధానిగా చేసుకుంటేనే ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుందని అన్నారు.
మనం పోటీ పడేది హైదరాబాద్ తో అలాగే బెంగళూర్, చెన్నై, ముంబై వంటి మహా నగరాలతో. అందువల్ల వాటికి ధీటుగా ఎదగాలీ అంటే ఇప్పటికే అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న విశాఖ మీద ఫోకస్ పెట్టి ముందుకు సాగితేనే మరో పదేళ్ళకు అయినా ఏపీ కలలు నెరవేరుతాయని అన్నారు. విశాఖ ఆల్ రెడీ మెగా సిటీ. కాస్మోపాలిటిన్ కల్చర్ అక్కడ ఉంది. ఎంతో కొంత నిధులు వెచ్చిస్తే విశాఖ అద్భుతమైన క్యాపిటల్ సిటీ అవుతుంది అని అన్నారు.
ఈ సందర్భంగా తన మనసులో ఉన్న అనేక ఆలోచనలు కూడా ఆయన పంచుకున్నారు. విశాఖలో ఐకానిక్ టవర్స్ ని నిర్మిసామని, అలాగే ఐకానిక్ స్టేడియం, అద్భుతమైన సెక్రటేరియట్ ని కూడా కడతామని చెప్పారు. వీటి తరువాత విశాఖ స్వరూపమే మారిపోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో ఏపీని మొత్తం పోషించే బ్రహ్మాండమైన ఆర్ధిక వనరులు కలిగిన మహా నగరం అవుతుందని ఆశాభావాన్ని జగన్ వ్యక్తం చేశారు.
అవే భవనాలు అమరావతిలో కట్టవచ్చుగా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జగన్ జవాబు ఇస్తూ అమరావతిలో ఏవీ సాధ్యం కావని అన్నారు. అమరావతి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అది విజయవాడకు గుంటూరుకూ బహు దూరమని ఏకంగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకే లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఆ మీదట రాజధాని షేప్ తీసుకుని రావడానికి ఎన్ని లక్షల కోట్లు వెచ్చించాలో కూడా తెలియదు అన్నారు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే కనీసంగా ఇరవై నుంచి పాతికేళ్ళు పడుతుందని జగన్ అన్నారు. అదే విశాఖ అయితే ఈ రోజు నుంచే అక్కడ రాజధాని కళ తీసుకుని రావచ్చు అని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాల మీద ప్రేమతోనే విశాఖను కోరుకుంటున్నాను అని ఆయన జవాబు ఇచ్చారు.