జగన్ ఈజ్ బ్యాక్... బస్సుయాత్రలో స్పెషల్ ప్రికాషన్స్ ఇవే!
వైఎస్ జగన్ కు విజయవాడలో బస్సు యాత్ర సమయంలో... ఎడమ కనుబొమ్మపై గాయమై, స్టిచ్చెస్ పడిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ కు విజయవాడలో బస్సు యాత్ర సమయంలో... ఎడమ కనుబొమ్మపై గాయమై, స్టిచ్చెస్ పడిన సంగతి తెలిసిందే. ఓ ఆగంతకుడు జగన్ పై దాడిచేశాడు. ఈ సమయంలో జగన్ కు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినా.. షెడ్యూల్ ను మార్చే ఆలోచన లేదని.. కేవలం ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకుని జనంలోకి వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ బస్సుయాత్రలో ప్రత్యేక సెక్యూరిటీ చర్యలు చేపట్టారు అధికారులు.
అవును... వైఎస్ జగన్ పై ఓ అగంతకుడు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆదివారం ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్.. తిరిగి "మేమంతా సిద్ధం" బస్సు యాత్రను ప్రారంభించేశారు. దీంతో... అధికారులు ప్రత్యేక సెక్యూరిటీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... సీనియర్ డీఎస్పీలు, సీఐలు, శిక్షణ పొందిన పోలీసు అధికారులు ఆయన భద్రత కోసం మోహరించారు!
ఇదే సమయంలో భద్రతా ఏర్పాట్లలో మరికొన్ని మార్పులు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... జగన్ పర్యటించే ప్రతి మండలాన్ని భద్రతా, నిఘా విభాగం నిశితంగా పరిశీలిస్తుంది. ఇదే క్రమంలో... జగన్ ప్రయాణిస్తున్న బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, భద్రతా కారణాల దృష్ట్యా జగన్ బస్సు పైభాగంలో ఎక్కువ సమయం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది!
ఇక ఈ రోజు "మేమంతా సిద్ధం" షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా " కృష్ణాజిల్లా సిద్ధమా?" అంటూ జగన్ ట్వీట్ చేశారు. కేసరపల్లి నుంచి ఉదయం బస్సులో సీఎం జగన్ బయలుదేరారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తనకు గాయమైన తర్వాత సీఎం జగన్ తొలిసారి జనాల్లోకి వస్తుండటం.. పైగా అవి గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలు అవ్వడంతో.. గుడివాడలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ప్రసంగంలో భాగంగా... తనపై జరిగిన హత్యాయత్నంపై ఆయన తొలిసారి స్పందించే అవకాశముందని అంటున్నారు. దీంతో... తనకు తగిలిన గాయంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు కూడా జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.
ఇదే సమయంలో జగన్ పై దాడి జరిగిన అనంతరం జరుగుతున్న తొలి సభ కావడంతో... గుడివాడలో కొడాలి నాని ప్రసంగంపైనా తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు!!