జగన్ తక్షణ కర్తవ్యం ఇదే.. కౌంటర్ ఇస్తేనే మనుగడ.. !
ఓడిపోయిన పార్టీ.. అధికారం కోల్పోయిన పార్టీ.. అన్న ఆలోచన ఆయనకు ఉంటుంది.
వైసీపీ అధినేత జగన్ తక్షణం చేయాల్సిందేంటి? అధికారం పోయిందనే బాధ నుంచి దాదాపు బయట పడినా.. ఇంకా తమ వైపే ప్రజలు ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. ఆయనకు 40 శాతం మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. దీనిని ఎవరూ కాదనరు. అలాగని..ఇది స్థిరంగా ఉంటుందని ఆయన భావిస్తే పొరపాటే. ఎందుకంటే.. నాణేనికి రెండో వైపు నుంచి జగన్‌పై దాడి జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు.
జగన్ పాలన అయినా.. ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయినా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టుగా ఆయన చచ్చిన పామే అయినా.. ఏపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనను వదిలి పెట్టడం లేదు. మరింత డ్యామేజీ చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదేళ్ల పాలన లోని లోపాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అక్రమాలు జరిగాయంటూ.. తవ్వి తీసేందుకు కూడా రెడీ అయింది. ఇది ఎన్నికల కంటే కూడా.. జగన్‌కు ఇప్పుడు పెద్ద సవాల్.
ఓడిపోయిన పార్టీ.. అధికారం కోల్పోయిన పార్టీ.. అన్న ఆలోచన ఆయనకు ఉంటుంది. కానీ, ప్రత్యర్థులకు ఉండదు. ఇదే రాజకీయం. దీనికే పదును పెంచుతోంది.. అధికార పార్టీ కూటమి. పవన్ నుంచి చంద్రబా బు వరకు.. మంత్రుల నుంచి నాయకుల వరకు కూడా.. జగన్ పాలనలోని లోపాలనే కాదు.. అక్రమాలు చేశారంటూ.. రోజుకో రూపంలో ఎండగడుతున్నారు. తద్వారా.. ఇప్పటి వరకు జగన్‌కు ఉన్న సింపతీ రాజకీయాలు మరింత దూరమయ్యే అవకాశం ఉంది.
ఇదేసమయంలో సొంత సోదరి.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్.. షర్మిల కూడా.. పొంచి ఉన్న ప్రత్యర్థేనన్న విషయాన్ని జగన్ మరిచిపోకూడదు. పార్టీ పుంజుకోవాలంటే.. వైసీపీని మరింత చిత్తు చేయాలన్న వ్యూ హంతోనే.. షర్మిల అడుగులు వేస్తున్నారు. దీనిని పసిగట్టక పోవడంతోనే కీలకమైన 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం పడివైసీపీ సెకండ్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభావం సీమలో ఎక్కువగా కనిపించింది.
ఈ నేపథ్యంలో ఎప్పుడో ఐదేళ్ల తర్వాత.. జరిగే ఎన్నికల్లో తాము గెలుస్తామని.. చెబుతున్న జగన్‌ను చూసి..నవ్వుకునే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలం టే.. ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ దాడికి వెనువెంటనే సమాధానం చెప్పాలి. జగన్ సర్కారు అంటే.. దోపిడీ సర్కారు అనే భావన పెరుగుతున్న దరిమిలా.. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. లేక పోతే.. మరింత ప్రమాదం పొంచి ఉందనేది ఖాయం అంటున్నారు పరిశీలకులు.