ఫైట్ చేయాలని చెప్పి గంటే అసెంబ్లీలో ఉండటం ఏంటి జగన్?

ఇంత మాట్లాడిన జగన్.. చేతల విషయానికి వస్తే.. ఎమ్మెల్యేగా తన ప్రమాణస్వీకారం పూర్తి అయిన తర్వాత కనీసం తనకు కేటాయించిన సీటులో కూడా కూర్చోకుండా బయటకు వెళ్లిపోవటం గమనార్హం.

Update: 2024-06-22 04:05 GMT

గెలుపు ధీమా వేళ నోటి నుంచి వచ్చే మాటల్ని కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో దారుణ పరాజయం ఎదురైన వేళ.. లోతైన ఆత్మవిమర్శతో పాటు.. వాస్తవ అంశాలపైనా ఫోకస్ చేయటం.. తాను మార్చుకోవాల్సిన తీరు గురించి మరికాస్త శ్రద్ధ పెట్టటం చాలా అవసరం. కానీ.. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవేమీ పట్టినట్లుగా లేదు. ఇందుకు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజున చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

సభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన ఆయన.. పార్టీ శాసన సభాపక్ష గదికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష హోదా లేదని మనల్ని హేళన చేస్తారు.. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుతారు. అయినా ఫర్లేదు.. మనం ఫైట్ చేయాలి. ప్రతిపక్షంగా స్వరాన్ని వినిపించాలి" అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఇంత మాట్లాడిన జగన్.. చేతల విషయానికి వస్తే.. ఎమ్మెల్యేగా తన ప్రమాణస్వీకారం పూర్తి అయిన తర్వాత కనీసం తనకు కేటాయించిన సీటులో కూడా కూర్చోకుండా బయటకు వెళ్లిపోవటం గమనార్హం.

సభలో సభ్యులు హేళనకు గురవుతారన్న భావన ఉన్నప్పుడు.. వారందరికి అండగా నిలవాల్సిన అవసరం నాయకుడిగా ఆయన మీద ఉంటుంది. కానీ.. ఆ పని చేయలేదు.తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే వేళలో అక్కడే ఉండి.. వారికి తాను అండగా ఉంటానన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ చేయలేదు. మరోవైపు జగన్ అంచనాలకు తగ్గట్లే అసెంబ్లీలో ఏమైనా జరిగిందా? అంటే అదీ లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినప్పటికీ ఆయన గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి సభ్యులకు చంద్రబాబు సూచన చేశారు.

ఆయన మాటలకు తగ్గట్లే ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయలేదు. మౌనంగా ఉండిపోయారు. సభకు వచ్చే విషయంలోనూ వైసీపీ నేతలు కోరిన అన్ని విషయాల్ని వారికి అనుకూలంగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం చూస్తే.. జగన్ వాహనాన్ని అసెంబ్లీ నాలుగో మొయిన్ డోర్ గేటు వద్ద కారు దిగి..నడుచుకొని లోపలకు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆయన వామన శ్రేణిని అలా కాకుండా అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించాలని కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించారు.

అంతేకాదు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికి.. చివర్లో కానీ ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణం చేయాల్సి ఉంది.కారణం.. ఆంగ్ల అక్షర మాలలో ఆయన పేరు చివర్లో వస్తుంది. కానీ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తమ నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించేలా నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేతలు కోరగా.. అందుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం ఓకే చేసింది. ఇలా జగన్ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తమను హేళన చేస్తారంటూ తన సభ్యులకు జగన్ చెప్పటం గమనార్హం.

Tags:    

Similar News