నేత‌లు చెప్ప‌ని నిజం: జ‌గ‌న్ మాట `శాస‌నం` కాదు...!

అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌కు త‌ప్పించి.. దాదాపు 85 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు.

Update: 2024-08-10 10:30 GMT

వైసీపీ ఎందుకు ఓడిపోయింది? 2.70 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు డీబీటీ(నేరుగా న‌గ‌దును బ్యాంకుల్లో జ‌మ‌చేయ‌డం) ద్వారా పేద‌ల‌కు అందించినా.. ఎందుకు చిత్తుగా మారిపోయింది? అంటే.. క‌ర్ణుడిచావుకు కోటి కార‌ణాలు అనే స‌మాధానం వ‌స్తుంది. ఇలాంటి వాటిలో కీల‌క‌మైన కార‌ణం.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. అదే.. `మార్పులు`. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. పార్టీలో టికెట్ల విష‌యంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు.

అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌కు త‌ప్పించి.. దాదాపు 85 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. కొంద‌రిని వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌లు త‌న‌ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేస్తార‌ని జ‌గ‌న్ అంచ‌నా వేసుకున్నారు. దీనికి కార‌ణం.. ఐప్యాక్ స‌ర్వే స‌హా.. సొంత‌గా మీడియా ద్వారా చేయించిన స‌ర్వేలు. ``మీరంటే జ‌నం విర‌గ‌బ‌డి పోతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలంటేనే విరుచుకుప‌డుతున్నారు`` అని స‌ర్వేలు అప్ప‌ట్లో జ‌గ‌న్‌కు రొద పెట్టాయి.

దీంతో జ‌గ‌న్ మార్పులు చేశారు. అయితే.. ఈ మార్పుల కార‌ణంగా.. హ‌ర్ట్ అయిన వారిని ఆయ‌న ఓదార్చ లేక పోయారు. క‌నీసం పిలిచి కూడా వారిని అనున‌యించ‌లేక పోయారు. `నా మాటే శాస‌నం` అన్న‌ట్టుగా జ‌గ‌న్ మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. త‌ర్వాత‌.. ఏం జ‌రిగిందంటే.. మార్పుల‌ను నాయ‌కులు కొంద‌రు త‌ప్పుబ‌ట్టి.. పొరుగు పార్టీల్లోకి వెళ్లి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఈ అవ‌కాశం లేనివారు మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ మౌన‌మే పార్టీ కొంప ముంచిందని అంటున్నారు.

టికెట్లు ద‌క్క‌ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు .. టికెట్లు తెచ్చుకున్న‌వారికి స‌హ‌క‌రించ‌క‌పోగా.. పార్టీకి యాంటీగా ప్ర‌చారం చేశారు. గుంటూరు వెస్ట్‌, తిరువూరు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ వంటి అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌లో టికెట్ ద‌క్క‌ని వారు పార్టీలోనే ఉన్నా.. అభ్య‌ర్థుల‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేదు. పైగా.. స‌హ‌క‌రిస్తున్న ట్టుగా న‌టించారు. ఈ విష‌యంలో తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి బ‌య‌ట‌ప‌డిపోయారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక‌.. ఆయ‌న క‌క్కేశారు. కానీ, మిగిలిన వారు చేయాల్సింది చేసి.. పార్టీలు మారుతున్నారు. ఏదేమైనా.. జ‌గ‌న్ మాట శాస‌నం కాద‌ని నాయ‌కులే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News