బొటాబొటీ సీట్లతో జగన్ పాలన చేయగలరా ?
అదే అధికారం చేతిలో పడిననాడు 151 సీట్లు అందుకున్నారు. దాంతో జగన్ మాట పూర్తిగా చలామణీ అయింది.
జగన్ ఎపుడూ దూకుడుగానే పాలిటిక్స్ చేస్తారు. ఆయనకు సొంత పార్టీ వల్ల ఆ అవకాశాలు పుష్కలంగా దక్కాయి. ఆయన విపక్షంలో ఉంటే 67 సీట్లు సాధించారు. అదే అధికారం చేతిలో పడిననాడు 151 సీట్లు అందుకున్నారు. దాంతో జగన్ మాట పూర్తిగా చలామణీ అయింది.
ఏ రాజకీయ పార్టీ అయినా ఆశావహులు ఉంటారు. అసంతృప్తులు ఉంటాయి. ఎవరైనా తమకు పదవి దక్కక పోతే చాలా బాధ పడతారు. కొందరు అయితే హద్దులు దాటి తీవ్ర నిర్ణయానికి కూడా సిద్ధపడతారు. అయితే జగన్ 2019 నుంచి 2024 అయిదేళ్ళ పాలనలో చూస్తే మంత్రి వర్గం కూర్పు నుంచి అన్ని నిర్ణయాలకు పూర్తి స్వేచ్చతో తీసుకున్నారు.
ఆనాడు ఆశావహులు చాలా మంది ఉన్నారు. కానీ వారంతా బాధపడినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే విపక్షం వెరీ వీక్ గా ఆ అయిదేళ్ళూ ఉంది. దాంతో అటు నుంచి ఇటు వైపు చేతులు కలిపినా సుఖం ఉండదు సరికదా మెడ మీద ఫిరాయింపుల కత్తి పెట్టి వేటు వేస్తారు. అలా అనేక నిర్ణయాలు జగన్ నాడు తీసుకున్నా అంతా ఓకే అనే అంటూ వచ్చారు.
అయితే ఈసారి టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా ఏపీలో ఎన్నికలు సాగాయి. సర్వేలు అంచనాలు ఎన్ని చూసుకున్నా రెండు పక్షాలకూ చాన్స్ అనే అంటున్నారు. ఎవరు పవర్ లోకి వచ్చినా కూడా బొటా బొటీ మెజారిటీతోనే అని కూడా చెబుతున్నారు. కొన్ని అంచనాలు అయితే వైసీపీకి 93 నుంచి 96 సీట్లు మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో టీడీపీ కూటమిని 79 సీట్లు ఇచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరగా రెండు పార్టీలు మోహరించి ఉంటాయన్న మాట.
ఈ నేపధ్యంలో ఇటు నుంచి అటు ఎవరు జంప్ చేసినా ఏకంగా ప్రభుత్వానికే ఇబ్బంది వస్తుంది. ఇక అవతల పక్షంలో చంద్రబాబు 79 సీట్లు కనుక సాధించి వస్తే జగన్ పాలన సాఫీగా సాగుతుందా అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది. ఇదంతా ఊహాజనితం అని అనుకున్నా అంచనాలు అలా ఉన్నపుడు వీటి గురించి కూడా మాట్లాడుకోవడం అవసరం అన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంది.
చంద్రబాబు రాజకీయ గండర గండడు అని చెబుతారు. ఆయన రాజకీయంగా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు అన్నది 2019 నుంచి 2024 మధ్యలోనే రుజువు అవుంది. బండ మెజారిటీ వైసీపీకి ఉన్న వేళ కేవలం తనకు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో ఆయన ఎమ్మెల్సీ సీటుని సాధించారు అంటే ఆ చాతుర్యం వర్ణించగలమా అన్నది కూడా మాట ఉంది.
అలాంటిది జగన్ కి బొటా బొటీ మెజారిటీ వస్తే ఎలా పాలన సాగుతుంది అన్నదే చర్చగా ఉంది. సర్వేలు నిజమై వైసీపీ అధికారం చేపట్టినా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీ ఒంటరిగానే పోరాడింది.
కేంద్రంలోని బీజేపీతో పొత్తు లేదు, ఈసారి అలా కాదు ఎన్డీయే మెంబర్ గా టీడీపీ ఉంది.కేంద్రంలో మోడీ వస్తే కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి దక్కుతాయి. అదే విధంగా కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి జగన్ సర్కార్ ని కట్టడి చేయడానికే చూస్తుంది.
దాంతో పాటు గత అయిదేళ్ళ పాటులా హాయిగా సాగిన పాలన మాదిరి ఈసారి సాగే అవకాశాలు వైసీపీకి తక్కువ అని అంటున్నారు. బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జగన్ పూర్తిగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వైసీపీ ఆకర్ష్ మంత్రంతో టీడీపీ కూటమి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాలనుకున్నా కేంద్రంలో మోడీ సర్కార్ ఉంటే అసలు వీలు పడదని అంటున్నారు.
అయితే ఇదంతా కొన్ని సర్వే సంస్థల అంచనా మాత్రమే అని వైసీపీకి అనుకూలంగా భారీ ప్రభంజనమే వీచిందని ఎంత తక్కువగా వేసుకున్న 130 నుంచి 140 సీట్లు వస్తాయని కూడా లోపాయికారీగా పార్టీలో వినిపిస్తున్న మాటగా ఉంది. జగన్ అయితే 151 సీట్ల కంటే ఒకటి ఎక్కువే వస్తుంది అని అంటున్నారు. అలా జరిగితే మాత్రం పూర్వం మాదిరిగా వైసీపీ అధినాయకత్వం తనదైన శైలిలో పాలన చేయగలదు లేకపోతే మాత్రం ఇబ్బందులే అది కూడా మొదటి రోజు నుంచే అని వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు అంచనాలు ఎలా నిజమవుతాయో లేక ఏమి జరుగుతుందో.