నాడు ఉగ్రవాదంపై పుస్తకం.. నేడు విమానాలకు బెదిరింపులు.. ఎవరీ యూకీ?
పోలీసులు.. నాగ్ పూర్ లోని గోండియాకు చెందిన జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వా రా పలు ఎయిర్ లైన్స్ లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు.
గత రెండు వారాలకు పైగా దేశంలో పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ 15 రోజుల్లోనూ సుమారు 410 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులకు బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. ఈ సమయంలో... బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించించారు.
అవును... గత పక్షం రోజులుగా దేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై జాబితాలో చేర్చుతామని.. వారికి జీవిత ఖైదు విధించే విషయంలోనూ చర్చిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు కూడా.
అయినప్పటికీ ఈ బెదిరింపులు ఆగడం లేదు. సోమవారం కూడా సుమారు 62 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అయితే.. అతడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించాడని చెబుతున్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఈ విషయాలపై స్పందించిన పోలీసులు.. నాగ్ పూర్ లోని గోండియాకు చెందిన జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వా రా పలు ఎయిర్ లైన్స్ లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీంతోపాటు ప్రధానమంత్రి, రైల్వే మంత్రి, పలు ఎయిర్ లైన్స్ ఆఫీసులు, మహారాష్ట్ర సీఎం, డీజీపి, ఆర్.పీ.ఎఫ్. లతో పాటు పలు ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెసేజ్ లు పంపించాడు.
ఇదే సమయంలో... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను బెదిరించడంతో.. ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే... నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్ళు పోలీసులు తెలిపారు. 2021లో ఈ నిందితుడు ఓ కేసులో అరెస్టైనట్లు వెల్లడించారు!