జగ్గారెడ్డి లెక్కనే వేరప్పా.. వచ్చే ఎన్నికల్లో నో పోటీ

అందరి రాజకీయ నేతల మాదిరి ఉండేందుకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అస్సలు ఇష్టం ఉండదు.

Update: 2024-10-14 05:30 GMT

అందరి రాజకీయ నేతల మాదిరి ఉండేందుకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అస్సలు ఇష్టం ఉండదు. తరచూ సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే ఆయన.. తాజాగా మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఓటుకు రూ.2వేలు పంచి తనను ఓడించారన్న జగ్గారెడ్డి.. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచటం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే తన వద్ద ఉన్న డబ్బులతో పండుగల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల మధ్యే ఉంటానన్న జగ్గారెడ్డి. నియోజకవర్గం డెవలప్ మెంట్ నిధుల కోసం ముఖ్యమంత్రిని కలిసి తీసుకొస్తానని చెబుతున్నారు.

అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తనకు బదులుగా తన భార్య నిర్మలారెడ్డి లేదంటే తన అనుచరుడు ఆంజనేయులకు పోటీ చేసే అవకాశం ఇప్పిస్తానని చెప్పారు. ఈ విషయంలో తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు తెలియజేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీగా తోపాజీ అనంత కిషన్ కు అవకాశం ఇవ్వాలన్న విషయాన్ని పార్టీకి చెబుతానన్న జగ్గారెడ్డి మాటలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి నేతలంతా తమకు.. తమ కుటుంబ సభ్యులకు పదవులు అడిగే తీరుకు భిన్నంగా జగ్గారెడ్డి మాటలు ఉన్నాయని చెప్పాలి. ఆయన చెప్పినట్లే పార్టీ చేస్తుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.


Tags:    

Similar News