భారత్ –కెనడా వ్యవహారం.. అమెరికా తీరు షాకేనా?
తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ మీడియాతో మాట్లాడారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్– కెనడాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఏజెంట్లే తమ పౌరుడిని తమ దేశంలోనే అంతమొందించారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా హత్యకు నిరసనగా కెనడాలో భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కెనడియన్లకు భారత్ తన వీసాలను నిలిపివేసింది. ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయులకు పలు జాగ్రత్తలతో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
మరోవైపు కెనడా – భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు పొరుగు దేశమైన అమెరికా మొదట్లో ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం తన అవసరాల కోసం భారత్ కు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదట్లో ఆ దేశం కెనడా విజ్ఞప్తిపై పట్టీపట్టనట్టుగా ఉంది. కానీ ఇప్పుడు దాని స్వరంలో మెల్లిగా మార్పు వస్తోంది.
కెనడా.. అమెరికా ఆధ్వర్యంలోని నాటో దేశాల కూటమిలో సభ్యురాలిగా ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ–8లోనూ సభ్య దేశంగా ఉంది. అలాగే భారత్ సభ్యురాలిగా ఉన్న జీ–20 దేశాల కూటమిలోనూ కెనడాకు సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా.. భారత్ కు పలు సూచనలు చేస్తోంది. కెనడా కోరినట్టు హరదీప్ సింగ్ హత్య వ్యవహారాన్ని ఇరు దేశాలు దర్యాప్తు చేయాలని.. ఈ విషయంలో కెనడాకు భారత ప్రభుత్వం సహాయం చేయాలని అమెరికా కోరుతోంది.
తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. దౌత్యవేత్తలతో ప్రైవేటుగా ఏం సంభాషణ జరిగిందో తాను వెల్లడించనన్నారు. కానీ, ఈ విషయంలో మేము భారత్ లోని అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలతో టచ్ లో ఉన్నామని వెల్లడించారు. ఇక ముందు కూడా ఉంటామన్నారు.
హరదీప్ సింగ్ హత్య వ్యవహారం అమెరికాకు ఆందోళనకరమని జాక్ సలీవాన్ హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై నిరంతరం భారత్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈ విషయంలో భారత్ కు ప్రత్యేకమైన మినహాయింపు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పనులకు తాము ఏ దేశానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వబోమన్నారు. ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందన్నారు.
భారత్ తో సంబంధాలు బలోపేతం చేసుకొనే క్రమంలో కెనడా వైపు అమెరికా బలంగా మాట్లాడటంలేదనే వాదనను జాక్ సలీవాన్ తోసిపుచ్చారు. కెనడా ఆరోపణలను అమెరికా తీవ్రంగా తీసుకుందన్నారు. కెనడాతో ఈ విషయంలో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. కెనడాతో తమకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు.
కాగా జీ20లోనే.. హరదీప్ సింగ్ హత్యపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రస్తావించారని బ్రిటన్ పత్రిక... ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం వెలువరించింది. ముఖ్యంగా ఆంగ్లో సాక్సన్ దేశాల సమూహమైన ‘ఫైవ్ ఐస్’ గ్రూప్‌లోని పలు సభ్యదేశాలు కూడా అదే సమయంలో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు తెలిపింది. అప్పట్లో హత్య విషయాన్ని ప్రధాని మోదీ వద్ద నేరుగా ప్రస్తావించాలని ఫైవ్ ఐస్ సభ్యదేశాలను కెనడా కోరిందని వెల్లడించింది. దీంతో బైడెన్, ఇతర దేశాధినేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు ఆ పత్రిక వ్యాఖ్యానించింది. కాగా ఈ కథనంపై అమెరికా మౌనం వహిస్తోంది.
వాస్తవానికి జీ20 సదస్సు సందర్భంగా కెనడా–భారత్ ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. ఇవి ముగిసిన వెంటనే కెనడాలోని ఖలిస్థాన్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ ప్రకటన వెలువరించింది.
మరోవైపు ఖలిస్థాన్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం హ్యూమన్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించిందని అక్కడి పత్రిక సీబీఎస్ న్యూస్ ఒక కథనంలో తెలిపింది. ప్రైవేటు సంభాషణల్లో భారతీయ అధికారులు ఎవరూ ఈ ఆరోపణలను బలంగా ఖండించకపోవడం కూడా హత్యలో ఆ దేశ హస్తాన్ని సూచిస్తోందని సీబీఎస్ తన కథనంలో పేర్కొంది. భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఈ సమాచారాన్ని సేకరించినట్లు కెనడా అధికారి వెల్లడించారని అసోసియేటెడ్ ప్రెస్ తన కథనంలో వెల్లడించింది.