అందాల కశ్మీర్ లో మెలిక.. లోయ ఒకరిది.. జమ్మూ మరొకరిది!

అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ను, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను దాదాపు ఐదేళ్లుగా ఉంచింది.

Update: 2024-10-10 10:38 GMT

మొన్నటివరకు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం.. ఇప్పుడు ప్రజా తీర్పు ద్వారా ప్రభుత్వం ఏర్పాటు కానున్న రాష్ట్రం.. ఒకసారి ఎన్నికలు జరిగి ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ఇక సర్కారు ఏర్పడడమే తరువాయి. అయితే, జమ్మూకశ్మీర్ మొదటి నుంచి కొంత ప్రత్యేకమే కదా..? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కశ్మీర్ లో హంగ్ ఖాయమని చెబితే.. ప్రజలు మాత్రం స్ఫష్టమైన తీర్పునిచ్చారు. అయితే, ఇక్కడో మరో మెలిక పెట్టారు.

ఇదీ కశ్మీర్ ఫిగర్..

జమ్మూకశ్మీర్ అంటే ఒకప్పుడు లద్దాఖ్ తో కూడిన ప్రాంతం. కానీ ఆర్టికల్ 370 రద్దుతో రెండుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ను, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను దాదాపు ఐదేళ్లుగా ఉంచింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ కు ఎన్నికలు జరగడంతో ప్రభుత్వం కొలువుదీరాల్సిన సమయం వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి 49 స్థానాలు సాధించింది. కాగా, జమ్మూకశ్మీర్ అంటే.. ఇందులోనూ రెండు వేర్వేరు. జమ్మూ హిందువులు అధికంగా ఉండే ప్రాంతం. కశ్మీర్ అంటే.. పూర్తిగా అందాలతో కూడిన లోయ. దీనినే కశ్మీర్ లోయ అంటారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 68.31 శాతం మంది ముస్లింలు, 28.44 శాతం హిందువులు, సిక్కులు 1.87 శాతం. బౌద్ధులు, క్రైస్తవులు, జైన్ లు, ఇతర మతాల వారు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. 22 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో ముస్లింలు అధికం.

ఎన్నికల్లో ఇలా..

లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 5 మందితో కలిపి కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 95. ఇందులో లోయలో 47, జమ్మూలో 43 సీట్లు ఉన్నాయి. లోయలో నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూలో బీజేపీ హవా చాటాయి. కాంగ్రెస్ ఆరు సీట్లే నెగ్గినా అవి కీలంగా మారాయి. అయితే ఒకటి తప్ప ఇవి హిందూ మెజారిటీ ప్రాంతమైన జమ్మూలోవి కాదు. విజేతలుగా నిలిచినివారిలో ఒక్క హిందువూ లేరు. ఎన్సీ నుంచి ఇద్దరు హిందువులు నెగ్గారు. పాకిస్థాన్ తో సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్‌ కు ఆనుకుని ఉండే నౌషేరా నుంచి సురీందర్ కుమార్ చౌదరి, రాంబన్ నియోజకవర్గం నుంచి అర్జున్ సింగ్ రాజు గెలుపొందారు. అంటే.. జమ్మూ పూర్తిగా ప్రతిపక్షానికి వేదికవగా.. లోయ, లైన్ ఆఫ్ కంట్రోల్‌కు ఆనుకున్న ప్రాంతాలు పూర్తిగా ఎన్సీకి అండగా నిలిచాయి.

జమ్మూ నుంచి మంత్రి ఎవరో?

కశ్మీర్ కొత్త మంత్రివర్గంలో జమ్మూ నుంచి ప్రాతినిధ్యం ఎలాగన్నది ప్రశ్నగా మారింది. ఎన్సీ నుంచి గెలిచిన ఇద్దరు హిందువులకు మంత్రి వర్గంలో చోటు కల్పించినా.. వారు జమ్మూకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు. ఈ పరిస్థితి.. తెలంగాణలో గత ఏడాది జరిగిన ఎన్నికలను గుర్తచేస్తోంది. నాటి ఎన్నికల్లో రాజధాని హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ కు సీట్లు రాలేదు. కేబినెట్‌ ‌లో రాజధాని నుంచి ఎవరూ లేరు.

Tags:    

Similar News