కశ్మీర్‌లో కూటమి పాలన.. ఒక ఒరలో రెండు కత్తులు!
కానీ, ప్రజలు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.
జమ్ము కశ్మీర్‌లో విజయం ఎవరిదనేది స్పష్టమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న జమ్ము కశ్మీర్‌లో అధికారం కోసం బీజేపీ విఫల యత్నం చేసింది. అనేక విషయాలను తెరమీదికి తెచ్చింది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం వరకు పలు విషయాలను ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలు ప్రస్తావించారు. అంతేకాదు.. అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని కూడా ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకు న్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ము-కశ్మీర్.. అభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు.
కానీ, ప్రజలు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్-ఎన్సీలు కలిసి సర్కారును ఏర్పాటు చేయనున్నారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానున్నారు. ఇక, పలితాలను చూస్తే.. ఎన్సీకి 42 స్థానాల్లో విజయం దక్కగా.. మిత్రపక్షం 6 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. అయినా.. అత్యధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఎందుకంటే మేజిక్ ఫిగర్ 46. సో.. 42+6 కలిస్తేనే మేజిక్ ఫిగర్‌ను దాటుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎన్సీ-కాంగ్రెస్‌పార్టీలు సంయుక్తంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
ఏంటి సమస్య..
జమ్ము కశ్మీర్‌లో కూటమి సర్కారు ఏర్పడడం పెద్ద విషయం కాదు. అందరూ ఊహించిందే. కానీ, ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇరు పక్షాలు కూడా.. ఎన్నికల సమయంలో `ఆర్టికల్ 370`పై విరుద్ధ ప్రకటనలు చేశాయి. తాము అధికారంలోకి వచ్చేయగానే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఎన్సీ అధినేత ఒమర్ ప్రకటించారు. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇదే మంచి ఫలితాన్ని కూడా ఇచ్చింది. ఎన్సీ పోటీ చేసిన ఓట్ల వెల్లువ కురవడానికి కూడా ఈ పక్కా హామీనే కీలక కారణం. అయితే.. ఈవిషయంలో కాంగ్రెస్ నర్మగర్భంగా వ్యవహరించింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించినట్టుగానే ఉంది. అందుకే ఎన్నికల సమయంలో ఒమర్ చేసిన ప్రకటనను తాము సమర్థించడం లేదని జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. `ఫలితం` వచ్చాక ఆలోచిస్తామన్నారు. ఇది రాబోయే రోజుల్లో పెను వివాదంగా మారే అవకాశం ఉంది.
చాన్స్ చిక్కితే..
ఈ పరిణామాల నేపథ్యంలో(అంటే ఒకే ఒరలో కాంగ్రెస్-ఎన్సీలు కుదురుకోవడం) బీజేపీ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. తమకు ఏమాత్రం అవకాశం ఉన్నా.. వెంటనే కూటమిని కదలబార్చి.. పగ్గాలుదక్కించుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. బీజేపీకి కూడా.. తాజా ఎన్నికల్లో 29 స్థానాలు దక్కాయి. స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఇలా.. అటు - ఇటు చేసైనా.. కూటమి సర్కారును కూల్చేసినా.. ఆశ్చర్యం లేదనే చర్చ సాగుతోంది. సో.. ఇప్పుడు అధికారం దక్కిందన్న ఆనందం కన్నా.. పొంచి ఉన్న ప్రమాదంపైనే కూటమి ఎక్కువగా దృష్టి పెట్టాలనేది పరిశీలకులు సూచన.