కడపలో పవన్ క్యాంపు వైసీపీలో కాక పుట్టిస్తోందా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో క్యాంపు కార్యాలయం తెరుస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వైసీపీలో కాక పుట్టిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో క్యాంపు కార్యాలయం తెరుస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వైసీపీలో కాక పుట్టిస్తోంది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇదే విషయంపై స్పందిస్తూ పవన్ క్యాంపు రాజకీయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు తహశీల్దారును పరామర్శించడానికి కడప వెళ్లిన డిప్యూటీ సీఎం వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడి సరికాదన్న పవన్, తీరు మార్చుకోకపోతే తాను కడపలో క్యాంపు కార్యాలయం పెట్టి తోలు వలిచేస్తానని ఊరమాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ తామేమీ తోలు వలిపించుకోడానికి సిద్ధంగా లేమని ప్రకటించింది. డిప్యూటీ సీఎం హోదాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పనులు చేయాలి కానీ, సినిమా డైలాగులు చెప్పడం వల్ల వనగూరే ప్రయోజనమేంటంటూ నిలదీసింది.
వైసీపీ 11 సీట్లకు పరిమితమైనా ఇంకా బుద్ది మారలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్లపైనా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పందించారు. పవన్ ఒక స్థానం నుంచి అధికారంలోకి రాగా లేనిది తాము మళ్లీ అధికారంలోకి రాలేమా? అంటూ నిలదీశారు. తాము ఉద్యోగులను రాచి రంపాన పెట్టినట్టు పవన్ మాట్లాడుతున్నారని, తామేమైనా స్కూల్ పిల్లలమా? మీరు కంట్రోల్ చేయడానికంటూ ప్రశ్నించారు.
దీంతో డిప్యూటీ సీఎం కామెంట్లు వైసీపీలో అగ్గి రాజేసినట్లైంది. వాస్తవానికి పవన్ అధికారంలోకి వచ్చిన నుంచి రాయలసీమపై ప్రత్యేక ఫోకస్ చేశారు. రాష్ట్రంలో మరే ప్రాంతానికి వెళ్లని విధంగా ఈ 6 నెలల్లో మూడు సార్లు రాయలసీమలోనే పర్యటించారు. తన సొంత శాఖ పంచాయతీరాజ్ ప్రారంభించిన పల్లె పండుగను కడప జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత డిసెంబర్లో విద్యాశాఖ నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగుకు కడపకే వచ్చారు. తాజాగా తహశీల్దార్ పరామర్శ పేరిట మరోసారి కడప వచ్చారు. ఇలా తరచూ రాయలసీమ వస్తున్న పవన్.. భవిష్యత్ రాజకీయానికి పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాయలసీమలో రెండు స్థానాల నుంచి జనసేన పోటీ చేసింది. ఈ రెండు సీట్లలో ఒకటి ఉమ్మడి కడప జిల్లాలోనే ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోల్చితే రాయలసీమలో జనసేన బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో బలమైన నేతలు లేకపోవడం వల్ల పార్టీ విస్తరణకు ఆటంకంగా ఉందని డీసీఎం భావిస్తున్నారట. తాను తరచూ రాయలసీమ వస్తే, ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంతోపాటు క్యాడర్ను పెంచుకోవచ్చని తలుస్తున్నారట. అందుకే రాయలసీమలో క్యాంపు కార్యాలయం తెరుస్తానని ప్రకటించారంటున్నారు. కోస్తా ప్రాంతం పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ రాజకీయ వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ నేతలు.. ఆయనకు విరుగుడుగా రాయలసీమ సెంటిమెంట్ రాజేయాలని ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ను ఆదిలోనే అడ్డుకోకుంటే తమ పార్టీ కిందకు నీళ్లు రావడం ఖాయమనే ఉద్దేశంతో వైసీపీ అగ్రనాయకత్వం కౌంటర్ అటాక్ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.