పవన్ ఇదేనా జనసేన డిసిప్లైన్ ?

జనసేన అధినేత పదే పదే జనసేన శ్రేణులకు క్రమశిక్షణ గురించి చెబుతూ ఉంటారు. మనం కరెక్ట్ గా ఉండాలని అంటూ ఉంటారు.

Update: 2024-09-02 19:30 GMT

జనసేన అధినేత పదే పదే జనసేన శ్రేణులకు క్రమశిక్షణ గురించి చెబుతూ ఉంటారు. మనం కరెక్ట్ గా ఉండాలని అంటూ ఉంటారు. ఎవరినీ ఏమీ అనొద్దు అని కూడా అంటుంటారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రిగా పదవిని తీసుకున్నాక ప్రతిపక్షాన్ని పెద్దగా విమర్శిచినది లేదు. ఒక విధంగా ఆయన మంచి విధానాన్నే అనుసరిస్తున్నారు.

అది ఆయన ఒక్కరూ అమలు చేస్తే సరిపోతుందా. నాయకుడిని చూసి శ్రేణులు నేర్చుకోవాల్సిన అవసరం లేదా అన్న చర్చ వస్తోంది. జనసేన గతంలో ఏమో కానీ ఇపుడు ఏపీలో అధికారంలో కీలక భాగస్వామిగా ఉంది. అలాంటి పార్టీ వైపు కెమెరా కళ్ళు నిండుగా ఉంటాయి. అంతే కాదు అంతా ఫోకస్ పెడతారు. అలాంటి పార్టీకి చెందిన క్యాడర్ ఇంకా తాము విపక్షంలో ఉన్నామనుకుని బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అన్న చర్చ సాగుతోంది.

మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కారుని గుడివాడలో జనసేన శ్రేణులు ద్వంసం చేస్తున్న వీడియో బైట్స్ చూసిన వారు ఇదేంటి అనుకునేలా ఉన్నాయి. ఒక ప్రత్యర్ధి పార్టీకి చెందిన నాయకుడిని రోడ్ల మీదకు తిరగనీయమని సందేశం ఇస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు అక్కడ ఉండగానే జనసేన కార్యకర్తలు రెచ్చిపోవడాన్ని వీడియోలో అంతా చూశారు.

దాంతో ఏమిటిది అని ముక్కున వేలేసుకునే సీన్ ఉంది. నిజానికి అధికారం అంటే బాధ్యత. పవన్ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అంతే బాధ్యతతో ఉండాలి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలకు ఎపుడూ చాన్స్ ఉంటుంది. కానీ దానిని ఒక పరిధి వరకే తీసుకోవాలి. తవ్వి తీస్తూ పోతే ఎన్నో ఉంటాయి. గతంలో ఏదో అన్నారని ఇపుడు అధికారం ఉంది కదా అని ఒక మాజీ మంత్రి కారునే ధ్వంసం చేయాలనుకోవడం చూస్తే నిజంగా అందులో పేర్ని నాని ఉంటే ఆయన పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇలాంటి ప్రత్యక్ష దాడులు ప్రజాస్వామ్యంలో తగునా అన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. మనం ఇతర దేశాల మాదిరిగా లేము కదా పరిణతి చెందిన ప్రజాస్వామ్యవాదులుగా ఉంటున్నాం కదా అని ఈ సంఘటనలు చూస్తే అర్ధం కాక అయోమయంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ బలం అంతా జనసైనికులలోనే ఉంది.వారు కరెక్ట్ గా ఉంటేనే ఆయన కూడా ఎన్నో ఎత్తులకు ఎదుగుతారు. అలాంటి జనసేన శ్రేణులు ఈ విధంగా రోడ్డున పడి ప్రత్యర్థుల మీద దాడులకు తెగబడతామని అంటే అది ఏ రకమైన సంకేతాలను ప్రజలలోకి పంపుతుందన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓటమికి నోటి దురుసు నేతలు కొంతమంది కారణం అని అంతా విశ్లేషించుకునే నేపధ్యం ఉంది.

ఇపుడు అది కాస్తా మరో రెండు ఆకులు ఎక్కువగా చదివినట్లుగా ఈ రకంగా దాడులకు దిగుతామని అంటే జనసేన సుదీర్ఘ రాజకీయ గమనానికి ఇలాంటి చర్యలే అడ్డుకట్టలు అవుతాయని గుర్తెరగాలని కోరుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తాను నేర్చిన క్రమశిక్షణను పార్టీ శ్రేణులకు స్పూర్తి నింపేలా చేయడంలో విఫలం చెందారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఎవరైనా కూడా పార్టీ సిద్ధాంతాల మీద పోరాడాలి. వాటిని చర్చల ద్వారానే విభేదించుకోవాలి. అంతకు మించి హద్దులు దాటకూడదు, దురదృష్టవశాత్తు ఏపీలో ఆ పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అవి కాస్తా వ్యక్తిగత దాడులకు దారి తీస్తున్నాయి. సిద్ధాంతాలలో బలం లేనపుడే ఇలా జరుగుతుంది అని కూడా అంటున్నారు. దీంతో పవన్ చెబుతున్న క్రమశిక్షణ పార్టీ వారికి చెవికి ఎక్కకపోవడంతో ఇదేనా మీ డిసిప్లైన్ అని అంతా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతోంది.

ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడాల్సి ఉంది. లేకపోతే జనసేనకు అధినేతలు మేలు చేస్తున్నామనుకుని క్యాడరే పార్టీని ఇబ్బందుల్లో పెడుతోంది అన్నది మాత్రం వాస్తవం అని అంటున్నారు.

Tags:    

Similar News