జనసేనకు మరో రెండు పదవులు...?

జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలను గెలిచి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధించింది.

Update: 2024-06-17 09:36 GMT

జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలను గెలిచి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధించింది. ఇది అరుదుగా జరిగే రాజకీయ సన్నివేశంగా చూడాల్సి ఉంటుంది. ఇన్ని సీట్లు గెలిచిన జనసేనకు మూడే మంత్రి పదవులు ఇవ్వడం పట్ల ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉంది అన్న ప్రచారం సాగుతోంది. అయితే దానికి విరుగుడు అన్నట్లుగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తారు అని అంటున్నారు.

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు పేరు దాదాపుగా ఖరారు అయినట్లే అని అంటున్నారు. దాంతో డిప్యూటీ స్పీకర్ పదవి కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన లోకం మాధవి పేరు వినిపిస్తోంది. అదే విధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తోంది.

ఈ ఇద్దరిలో మహిళగా మాధవి పేరునే జనసేన టీడీపీ ముందుకు తెస్తున్నాయని అంటున్నారు. అయితే స్పీకర్ గా అయ్యన్నను ఎంపిక చేసి అదే ఉత్తరాంధ్రా ప్రాంతానికి చెందిన మాధవికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అన్న చర్చ సైతం సాగుతోంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం శ్రీఎకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం కి స్పీకర్ ఇచ్చి విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలా అయితే మాధవికి ఈ పదవి కన్ ఫర్మ్ అని అంటున్నారు. అలా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు లభించబోతోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మరో పదవి కూడా జనసేనకు దక్కవచ్చు అని అంటున్నారు. అదేంటి అంటే సాధారణంగా విపక్ష పార్టీలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారు. ఇది కేబినెట్ ర్యాంక్ హోదా కలిగినది. 2014లో ఈ పదవిని వైసీపీకే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆ పదవి అలా వైసీపీకి దక్కింది. అపుడు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఈ పదవిలో అయిదేళ్ల పాటు పనిచేశారు.

ఇక 2019లో టీడీపీ విపక్షంలోకి వచ్చింది. అపుడు పీఏసీ చైర్మన్ పోస్టుని పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. ఆయన కూడా కేబినెట్ ర్యాంక్ హోదాతో అయిదేళ్ల పాటు పనిచేశారు. ఇపుడు పీఏసీ చైర్మన్ పదవి విపక్షానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదాయే లేదు అన్న కారణంతో ఇవ్వరనే అంటున్నారు.

అలా వైసీపీకి ఇవ్వాల్సిన పదవిని జనసేనకు ఇవ్వవచ్చు అని గట్టిగా ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగే జనసేనకు మరో కేబినెట్ ర్యాంక్ పదవి దక్కుతుంది అని అంటున్నారు అలా అయిదు కేబినెట్ ర్యాంక్ పదవులు జనసేనకు లభించినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News