అమరావతి ఏకైక రాజధానిగా టీడీపీ జనసేన మ్యానిఫేస్టో...!
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచుతామని ప్రజలకు హామీ ఇస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫేస్టోని త్వరలో రిలీజ్ చేయబోతున్నారని పేర్కొంటున్నారు.
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచుతామని ప్రజలకు హామీ ఇస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫేస్టోని త్వరలో రిలీజ్ చేయబోతున్నారని పేర్కొంటున్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి మ్యానిఫేస్టో మీద గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతోంది. దీని కోసం యనమల నాయకత్వంలో టీడీపీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అందులో అశోక్ బాబు, పట్టాభి ఉన్నారు. అలాగే జనసేన నుంచి ముత్తా శశిధర్ వరప్రసాద్, శరత్ హాజరయ్యారు.
మొత్తం రెండు పార్టీల నుంచి ఆరుగురు సభ్యులు హాజరైన ఈ ఉమ్మడి సమావేశంలో అనేక అంశాలను చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ జనసేన మేనిఫెస్టో కమిటీ 11 అంశాలకు ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఈ మ్యానిఫేస్టో కరపత్రాలలో చంద్రబాబు, పవన్ ఫొటోలను ఉంచుతారని అంటున్నారు.
ఇదిలా ఉంటే అమరావతి ఏకైక రాజధాని అంటూ టీడీపీ జనసేన జనంలోకి వెళ్లాలని డిసైడ్ అవుతున్నాయి. మరి మూడు రాజధానులతో వైసీపీ ఎటూ జనంలోకి వెళ్తుంది. మరి 2024 ఎన్నికల్లో ప్రజలకు అజెండా సంక్షేమ పధకాలు అవుతాయా లేక ఏపీకి రాజధాని అవుతుందా అన్నది ఇపుడు చర్చకు వస్తున్న విషయం.
ఏపీని సంపన్న రాష్ట్రంగా మార్చాలి అంటే అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఈ రెండు పార్టీలు అంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే అదే చేస్తామని చెప్పబోతున్నాయి. మరి ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రజల మనోగతం కూడా అలాగే ఉంటుందని ఈ రెండు పార్టీలు నమ్ముతున్నాయా అన్నదే చర్చగా ఉంది.
ఇదిలా ఉంటే మూడు రాజధానులు వైసీపీ చెప్పినా ఆచరణలో అది ఒక్క అడుగూ ముందుకు పడలేదు కాబట్టి ఆయా ప్రాంతాలలోని ప్రజానీకం కూడా ఒక రకమైన వైరాగ్యంలో ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఏపీకి రాజధాని లేదు అన్న విమర్శలు కూడా ఏపీ ప్రజానీకం మీద ప్రభావం చూపిస్తాయని విపక్షాలు నమ్ముతున్నాయి. అదే తమకు అడ్వాంటేజ్ గా మారుతుందని ఊహించే ఉమ్మడి మ్యానిఫేస్టోలో దాన్ని ఉంచుతున్నారని అంటున్నారు.
ఇక ఉచితంగా ఉచిత ఇసుక ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం, జనసేన సౌభాగ్యపదం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, మన ఆంధ్రప్రదేశ్-మన ఉద్యోగాలు అనే ఆరు ప్రతిపాదనల్ని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో పొందుపరుస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి వీటి మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.