జనసేనకు ఇచ్చే సీట్ల ప్రకటన అప్పుడే!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జనసేన పోటీ చే సే స్థానాలను, టీడీపీ పోటీ చేసే స్థానాలను అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పార్టీలు బరిలోకి దిగే స్థానాలపై మౌఖికంగా ఓ అంగీకారానికి వచ్చారని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాలని అనుకున్నాయి. అయితే అధికార వైసీపీ చేసే మార్పులకనుగుణంగా తాము పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల మార్పుకు వీలుగా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేశారని చెబుతున్నారు. వైసీపీ మరో రెండు రోజుల్లో దాదాపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలను కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు.
పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన ఎక్కడెక్కడ పోటీచేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని తెలుస్తోంది. కొన్ని స్థానాలపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. సంక్రాంతి తర్వాత జనసేన పోటీ చేసే సీట్లను అధికారికంగా ప్రకటించేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ఏయే జిల్లాల్లో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది దాదాపుగా తేలిపోయిందని సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాల్లో అత్యధికంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి విశాఖలో ఉన్నాయని అంటున్నారు. అలాగే ఈ జిల్లాల్లో పార్లమెంటు సీట్లలో నాలుగు చోట్ల జనసేన పోటీ చేయొచ్చని పేర్కొంటున్నారు.
సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించి గ్రామస్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్ కలిసి ఎన్నికల కదన రంగంలోకి దూకేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రణాళిక రచించారు. ఇప్పటికే ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ ఏ స్థానాల్లో బలంగా ఉందో లెక్కలేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జులతో సమీక్షలు జరుపుతున్నారు. అలాగే తన వద్ద సర్వే రిపోర్టుల ఆధారంగానూ ఆయన పలు అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్, కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాలు, లోపాలు–ప్రత్యర్థి పార్టీ పరిస్థితులు తదితర అంశాలన్నింటినీ పవన్ సమీక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఏయే అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోయేదీ కూడా చర్చిస్తున్నారు.