తెలంగాణాలో జనసేన పోటీ చేసిన సీట్లలో డిపాజిట్లు వస్తాయా...?

జనసేన పార్టీ తొలిసారిగా తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసింది. మొదట సొంతంగా పోటీ అని 32 సీట్లకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Update: 2023-12-01 17:30 GMT

జనసేన పార్టీ తొలిసారిగా తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసింది. మొదట సొంతంగా పోటీ అని 32 సీట్లకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆ తరువాత బీజేపీతో పొత్తులోకి వెళ్ళి ఎనిమిది సీట్లకు పోటీ పడ్డారు. ఇందులో ఏపీ సెటిలర్ల్స్ ఎక్కువగా ఉండే సీట్లే ఉన్నాయి. ఖమ్మం, హైదరాబాద్ వంటి చోట్ల జనసేన పోటీ పడుతోంది.

ఇక కూకట్ పల్లి సీటు మీద జనసేన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ టీడీపీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని జనసేన అంచనా వేసుకుంది. అలాగే కాపులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి విజయం తధ్యమని లెక్క వేసుకుంది. పవన్ కూడా చివరి రోజులలో ప్రచారం చేశారు. ప్రత్యేకించి కూకట్ పల్లిలో పవన్ రెండు సార్లు ప్రచారం చేశారు.

అలాగే ఖమ్మంలో కూడా ఆయన కలియ తిరిగారు. పవన్ సభలకు జనాలు బాగానే వచ్చారు. మరి బీజేపీతో కూడా పొత్తు ఉంది. ఈ రెండు కాంబినేషన్స్ కలసి జనసేనకు ఓట్లు ఎన్ని ఇస్తాయి అన్నదే ఇపుడు చర్చ. ఎందుకు అంటే ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే కాంగ్రెస్ బీయారెస్ మజ్లీస్ బీజేపీ దాకానే చెబుతూ వచ్చాయి. ఈసారి ఇండిపెండెంట్ల గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు.

అదే విధంగా చూస్తే జనసేన గురించి ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ లోనూ ప్రస్తావన లేకపోవడం విశేషం. మరి తొలిసారి పోటీ చేస్తున్న జనసేనకు ఎంత శాతం ఓట్లు వస్తాయి అన్నది అందరిలోనూ ఉత్సుకతగానే ఉంది. పవన్ అయితే కూకట్ పల్లి సభలో మాట్లాడుతూ ఈ సీటు గెలవడం చాలా ముఖ్యమని అన్నారు.

ఇక్కడ కనుక గెలిస్తే కచ్చితంగా ఏపీ రాజకీయాల్లోనూ ప్రభావం చూపవచ్చు అని అన్నారు. మరి కూకటి పల్లి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ పోటీ చేసిన ఎనిమిది సీట్లలోనూ జనసేనకు డిపాజిట్లు అయినా వస్తాయా అన్నదే ఇపుడు జరుగుతున్న అతి పెద్ద చర్చ. జనసేన ఓటు బ్యాంక్ ఎంత అన్నది ఈ ఎన్నికల్లోనే తేలుతుంది అని అంటున్నారు.

అయితే ఈసారి ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయని బీయారెస్ ని కొనసాగించాలా కాంగ్రెస్ కి చాన్స్ ఇవ్వాలా అన్న పాయింట్ మీదనే ఓట్లు తమ తీర్పు చెప్పారని అంటున్నారు. ఈ మధ్యలో మరేమీ చూడలేదని అంటున్నారు. ఇక మజ్లీస్ కి కూడా ఈసారి సీట్లలో కోత పడుతోందని ఒక వైపు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ఆశలు కూడా అంతగా నెరవేరవని అంటున్న పరిస్థితి ఉంది.

వీటి మధ్యలో జనసేన ఎక్కడ ఉంది అన్నదే అసలైన సందేహం. జనసేన ఓడితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగానే ఉంటే. అసలు డిపాజిట్లే రాకపోతే అపుడు పరిస్థితి ఏమిటి అన్నది మరో చర్చ. ఏది ఏమైనా తెలంగాణా ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతూంటే జనసేన సంగతేంటని కూడా మరో వైపు ఆసక్తి ఉంది అంటున్నారు. డిపాజిట్లు కనుక జనసేన కొన్ని సీట్లలో అయినా దక్కించుకుంటే మాత్రం అతి పెద్ద విజయమే అవుతుంది అన్న విశ్లేషణలూ ఉన్నాయి.

Tags:    

Similar News