జనసేనకు ‘గుర్తు’ చికాకులు తప్పినట్లేనా?

అందుకు తగ్గట్లే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడే ప్రకటనలు జనసైనికులకు గుండె దడను పెంచేలా ఉండేవి.

Update: 2024-06-05 04:36 GMT

పార్టీ పెట్టటంతోనే సరిపోదు. ఆ పార్టీని ఎన్నికల్లో కనీస సీట్లు గెలిచేలా చూసుకోవాలి. ఆ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా కొన్ని చికాకులు తప్పవు. అలాంటి వాటి విషయంలో జనసేన ఇప్పటివరకు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్న పరిస్థితి. ప్రతి ఎన్నికలకు ముందు.. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ దక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారేది. అందుకు తగ్గట్లే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడే ప్రకటనలు జనసైనికులకు గుండె దడను పెంచేలా ఉండేవి.

తాజా ఎన్నికల్లో తాను పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాల్ని గెలుచుకోవటం.. నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేటు ఉండటం అందరిని ఆకర్షించటమే కాదు.. ఈ ఫలితం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. తనకు వచ్చిన సీట్లలో సరిగ్గా సగం సీట్లు అధికార పక్షానికి రావటం పెను సంచనలంగా మారింది. గత ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే గెలుచుకోవటం.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవటం ఇబ్బందికరంగా మారింది. ఈ ఓటమి ఒక ఎత్తు అయితే.. సాంకేతికంగా ఎన్నికల సంఘం నుంచి ఎదురైన ఇబ్బందులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఇలాంటి వేళ.. తాజాగా వెలువడిన ఫలితాలు పార్టీ ఎన్నికల చిహ్నాలకు సంబంధించిన చికాకుల్ని తీర్చేయటం ఖాయం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8.53 శాతం ఓట్లను జనసేన దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన 137 స్థానాల్లో పోటీ చేయగా.. 17,36,811 ఓట్లు వచ్చాయి. ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.

ఈసారి ఎన్నికల్లో జనసేనకు 28,76,208 ఓట్లను సొంతం చేసుకుంది. మొత్తం 21అసెంబ్లీ స్థానాల్ని.. రెండు లోక్ సభా స్థానాల్ని సొంతం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 15 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే పోటీ చేసినప్పటికీ అన్నింట్లోనూ విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. దాదాపు మూడు శాతం ఓట్లను అదనంగా దక్కించుకోవటం గమనార్హం. దీంతో.. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తింపు రావటం ఖాయమని చెబుతున్నారు. ఇంతకాలం జనసేన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ హోదాలోనే ఉండేది. పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఎన్నికల సంఘం గుర్తింపు పార్టీ స్థాయికి చేరలేదు. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ కొరత తీరినట్లైంది.

Tags:    

Similar News