"మేడి పండు చూడ మేలిమై యుండు.. పొట్ట విప్పిచూడ పురుగులుండు.. పిరికివాని మదిని బింకమీలాగురా.. విశ్వదాభిరామ వినురవేమ" ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్థితికి, జనసేన పరిస్థితికి ఈ వేమన శతకంలోని పద్యం అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే చర్చ ఇప్పుడు కాపు సామాజికవర్గంలో వినిపిస్తుండటం గమనార్హం! "24 సీట్లు దక్కించుకున్న పర్లేదు.. అది కూడా 2019లో 10 కూడా రాలేదు కాబట్టి.. స్ట్రైక్ రేట్ బాగుంటే అంతే చాలు" తాజాగా పవన్ పలుకులు!
అవును... తాజాగా విడుదలైన టీడీపీ - జనసేన అభ్యర్థుల జాబితాలో జనసేనకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. అవేమిటనే విషయం ఇంకా సస్పెన్సే! ప్రస్తుతానికి 5 నియోజకవర్గాల పేర్లు ప్రకటించేశారు కాబట్టి... మిగిలిన 19 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు చెప్పక పోయినా సీట్ల పేర్లు అయినా ప్రకటించి ఉండాల్సింది అనేది మరో మాట. దీంతో తెరపైకి కొత్త సందేహాలు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటికి ప్రకటించిన వాటిలో కీలక స్థానాల పరిస్థితి ఇప్పుడు చూద్దాం!
టీడీపీ - జనసేన అభ్యర్థులను ప్రకటించగానే ఆహా.. ఓహో.. అద్భుతః.. అంటూ ఒక వర్గం మీడియా కోడై కూసేస్తుంది! ఇంతకు మించిన పొత్తు ధర్మం ఉంటుందా.. ఇంతకు మించిన క్లీన్ కలయిక ఉంటుందా అన్న రేంజ్ లో వెలుగులు జిమ్మే ప్రయత్నం చేస్తుంది!! అయితే... ప్రస్తుతానికి ప్రకటించిన జనసేన స్థానాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవ పరిస్థితి చూస్తుంటే... మేడిపండులా ఉంటే.. దానికి పసుపు పూత వేసి మాయచేసే పనిలో ఒక వర్గం మీడియా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి..
వివరాళ్లోకి వెళ్తే... కీలకమైన అనకాపల్లి స్థానాన్ని ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయించారు పవన్ కల్యాణ్. వాస్తవానికి అనకాపల్లి స్థానాన్ని పరుచూరి భాస్కరరావు ఆశిస్తున్నారు. చాలా కాలంలో ఇక్కడ పార్టీని నిర్మించుకుంటూ.. కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. మరోపక్క అనకాపల్లి టిక్కెట్ పై పీలా గోవిందు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రామకృష్ణ ఈయన బందువే అయినప్పటికీ... గోవిందు కేడర్ మాత్రం కొణతాలతో వెళ్లే విషయంపై పూర్తిస్థాయిలో సందేహాలున్నాయని అంటున్నారు.
దీంతో అనకాపల్లిలో అప్పుడే ఇంటిపోరు, వర్గ పోరు మొదలైన పోరులు మొదలైపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా మధ్యాహ్నం నుండి అక్కడ జనసేన క్యాడర్ లో వాతావారణం స్థబ్ధగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇక మిగిలిన నాలుగు స్థానాలూ పెద్ద సర్ ప్రైజింగ్ స్థానాలేమీ కాదనేది తెలిసిన విషయమే. నెల్లిమర్ల, కాకినాడ రూరల్, తెనాలి, రాజానగరం సీట్లు ఎప్పటినుంచో అనుకుంటున్నవే!
ఏది ఏమైనా... 175 స్థానాలకు గానూ 24 సీట్లకే పవన్ ఒప్పుకోవడం మాత్రం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారనేది మాత్రం వాస్తవం అని అంటున్నారు! ఇదే సమయంలో... ఎన్నో ఆశలు పెట్టుకున్న పలు కీలక స్థానాల విషయంలో కూడా పవన్ వెనక్కి తగ్గాల్సి వస్తుందనే మాటలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. దీంతో... గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటే... దీనికి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!