కేసీయార్ పేరెత్తితే ఒట్టు
వరంగల్ పోరాటస్పూర్తితోనే తాను ఏపీలో రౌడీలు, ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు
మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధులు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. మామూలుగా ఏ నియోజకవర్గంలో ఎవరు ప్రచారంచేసినా అభ్యర్ధుల గురించి, పార్టీ గురించి చెబుతూనే ప్రత్యర్ధులపైన ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడతారు. కానీ పవన్ రూటే సపరేటు. ఎలాగంటే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కూడా ఏపీ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనే ఆరోపణలు, విమర్శలు చేశారు.
వరంగల్ పోరాటస్పూర్తితోనే తాను ఏపీలో రౌడీలు, ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అసలు వరంగల్ పోరాటస్పూర్తికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధమే పవనే చెప్పాలి. నిజంగానే వరంగల్ పోరాటస్పూర్తి ఉంటే కేసీయార్ ప్రభుత్వం మీద పోరాటంచేయాలి. అంతేకానీ ఏ సంబంధంలేని జగన్ ప్రభుత్వంపైన పోరాటం చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒకవైపు బీజేపీ నేతలంతా కేసీయార్ ప్రభుత్వంలో అవినీతిపై విరుచుకుపడుతుంటే పవన్ మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
వాస్తవానికి పవన్ ఏమి మాట్లాడుతారో తనకు కూడా తెలీదు. ప్రచారంలో మాట్లాడుతు నాడు తెలంగాణాకు మద్దతిచ్చిన వారిలో తానూ ఒకడినని చెప్పారు. ఆమధ్య ఒకసారి మాట్లాడుతు ప్రత్యేక తెలంగాణా ఏర్పడినపుడు బాధతో 11 రోజులు అన్నంకూడా తినలేదని చెప్పింది కూడా ఈ పెద్దమనిషే. అంటే ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తనకే తెలియదని అర్ధమవుతోంది. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణాలో ఇంత అవినీతి ఉందని తాను ఊహించలేదన్నారు. ఇదే నిజమైతే మరి కేసీయార్ ప్రభుత్వాన్ని డైరెక్టుగా ఎటాక్ చేయటానికి ఎందుకు భయపడుతున్నట్లు ?
కేసీయార్ పేరెత్తాలంటేనే పవన్ భయపడిపోతున్నారు. అందుకనే తన రాజకీయమంతా ఏపీ కేంద్రంగానే చేస్తున్నారు. ఇపుడేదో కొత్తగా తెలంగాణాలో కూడా రెగ్యులర్ గా పర్యటిస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది పవన్ వ్యవహారం. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు కేసీయార్ ప్రభుత్వంపై నానా రచ్చచేస్తుంటే ఇంతకాలం నోరు కూడా మెదపలేదు. అలాంటిది ఎన్నికల ప్రచారం మరో ఆరు రోజుల్లో ముగుస్తుందనగా వచ్చి కేసీయార్ పేరు కూడా ప్రస్తావించకుండా ప్రచారం చేయటమంటేనే పవన్ ఎంత బయస్తుడో అర్ధమవుతోంది.