ఆత్మాభిమానం ఎఫెక్ట్... జనసేనలో మొదలైన రాజీనామాలు!

ఆత్మాభిమానం అనేది అధినేతకు మాత్రమే ఉంటుందా.. నేతలకూ, కార్యకర్తలకూ ఉండదా...? ప్రస్తుతం జనసేనలో బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదని అంటున్నారు

Update: 2023-10-09 05:37 GMT

ఆత్మాభిమానం అనేది అధినేతకు మాత్రమే ఉంటుందా.. నేతలకూ, కార్యకర్తలకూ ఉండదా...? ప్రస్తుతం జనసేనలో బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదని అంటున్నారు. మరోపక్క టీడీపీ - జనసేన పొత్తు అనేది పూర్తిగా పవన్ వ్యక్తిగత అభిప్రాయం అయినప్పుడు పార్టీలో తామంతా ఎందుకు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. తాజాగా జనసేనలో రాజీనామాలు మొదలయ్యాయి!

అవును... స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాకత్ అయిన పవన్ కల్యాణ్... బయటకు రాగానే పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కలిసే వెళ్తామని వెల్లడించారు. అయితే ఈ విషయం పూర్తిగా పవన్ - నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన డిస్కషనే తప్ప... మరో నేతకు తెలియదనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలోనే... నాలుగో విడత వారాహి యాత్రకు జనాల్లో స్పందన కరువయ్యిందని, జనాలు తగ్గారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే... టీడీపీ - జనసేన పొత్తును తమ్ముళ్లు ఆహ్వానించడం లేదా.. లేక, జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని అంటున్న నేపథ్యంలో... సగం సమాధానం లభించే విధంగా అన్నట్లుగా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కు షాక్ ఇచ్చారు జనసేన సీనియర్ నేత.

తన బలం, బలంగం అక్కడే ఉందంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా తన సొంతజిల్లా పశ్చిమగోదావరి నరసాపురం నియోజకవర్గం (మొగల్తూరు) నుంచి కాకుండా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా... ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పర్యటించారు.

అలా ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ కు షాక్ తగిలింది. ఇందులో భాగంగా... గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా... ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. తన పార్టీలో ఉన్న వారికి కూడా అవి ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని చెప్పడం గమనార్హం.

ఇదే సమయంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీలో కలిపి సుమారు 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని.. అయితే, పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఆ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం అపాయింట్‌మెంట్‌ కోసం సుమారు మూడు నెలలుగా వేచి చూసినా ప్రయోజనం లేదని, దీంతో ఈ అవమానం భరించలేక రాజీనామా నిర్ణయమని అన్నారు.

ఇదే సమయంలో గతంలో ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జనసేనలో చేరినప్పటికీ... అతి స్వల్ప కాలంలోనే పార్టీని వీడారు అనే విషయాలను గుర్తుచేసే ప్రయత్నం చేసిన గురుదత్త ప్రసాద్... అందులో భాగంగా... సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, రాజు రవితేజ, అద్దేపల్లి శ్రీధర్, జయలలిత వద్ద సీఎస్ గా పనిచేసిన రామ్మోహన్‌ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు జనసేనకు గుడ్‌ బై చెప్పారని అన్నారు.

ఈ సందర్భంగా తన రాజీనామాకు పార్టీ అధ్యక్షుడి తీరే కారణం అని స్పష్టంగా చెబుతున్న గురుదత్త ప్రసాద్... త్వరలో మరికొంతమంది నేతలు జనసేనకు రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు. అయితే... టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత హార్డ్ కోర్ జనసేన రాజకీయ నాయకులు హర్ట్ అయ్యారని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అంతా అంగీకరిస్తారనే పవన్ ఒంటెద్దు పోకడ ఆలోచనలతో విసిగిపోయారని, ఆ మేరకు త్వరలో మరిన్ని రాజినామాలు ఉండబోతున్నాయనే కామెంట్లు రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News