గాజు గ్లాస్ జనసేనకే...అయినా ఫ్రీ సింబల్!
ఇదేంటి అని అనుకోవచ్చు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అలాగే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ సంస్
ఇదేంటి అని అనుకోవచ్చు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అలాగే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ సంస్థ. నియమ నిబంధలన మేరకు పనిచేస్తుంది. రూల్స్ ని పక్కన పెట్టడం ఈసీ చరిత్రలో లేదు. ఈసీ కొరడా ఝలిపిస్తే ఎంతటి పెద్ద పార్టీ అయినా మూల్యం చెల్లించాల్సిందే.
ఇదిలా ఉంటే జనసేన తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ గా ఉంది. ఇది 2019 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 137 మంది జనసేన అభ్యర్ధులకు ఇచ్చిన గుర్తు. అయితే ఆ గుర్తుని వెనక్కి తీసుకుంది ఈసీ.
ఎందుకంటే జనసేన గుర్తింపు పొందిన పార్టీగా ఇంకా మారలేదు. ఈసీ నిబంధలను ఆ పార్టీ పూర్తి చేయలేకపోయింది. ఈ నేపధ్యంలో మొదటిసారిగా తెలంగాణాలో పోటీకి దిగింది. ఎనిమిది మంది అభ్యర్ధులు జనసేన తరఫున పోటీకి దిగుతున్నారు. బీజేపీతో పొత్తు ఉంది.
అయితే మరో మూడు వారాల్లో ఎన్నికలకు వెళ్లనున్న జనసేనకు ఈసీ నుంచి మొదట భారీ షాక్ తగిలింది. గాజు గ్లాస్ గుర్తుని తెలంగాణాలో ఫ్రీ సింబల్ చేస్తూ అందులో పెట్టేసింది. దాంతో జనసేన అభ్యర్ధులకు ఏమీ తోచకుండా పోయింది.
ఇది పెద్ద వార్త కూడా అయింది. అయితే దీని మీద జనసేన పడిన టెన్షన్ కి కొంత ఉపశమనం ఈసీ ఇచ్చింది. అదేంటి అంటే గాజు గ్లాస్ గుర్తు జనసేన బీ ఫారాలు ఇచ్చే అభ్యర్ధులకు ఉంటుంది. వారు అదే గుర్తుతో పోటీ చేయవచ్చు. అలా తెలంగాణాలో ఎనిమిది మంది అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నారు
అదే సమయంలో మిగిలిన 111 సీట్లలో మాత్రం గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ గా ఉంటుంది. అంటే దాన్ని ఇండిపెండెంట్లు కూడా తీసుకుని పోటీ చేసేవారికి కేటాయిస్తారు. అంటే గాజు గ్లాస్ ఒక్క జనసేనకే కాదు అన్నమాట. అది ఒక్క తెలంగాణాలోనే కాదు, ఏపీలో కూడా ఇదే పరిస్థితి అని అంటున్నారు.
రేపటి ఎన్నికల్లో జనసేనకు ఏపీ పోటీ చేసే సీట్లలో మాత్రమే గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకి ఇస్తారన్న మాట. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు దాన్ని తీసుకుంటారు. ఇదంతా జనసేన గుర్తింపు పొందిన పార్టీగా మారనంతవరకూ తప్పదు. మొత్తంగా చూస్తే 2024 ఎన్నికలలో ఇది తప్పదనే అంటున్నారు. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తుపై స్పష్టత ఇవ్వడంతో జనసేనకు ఎంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.