వైరల్ వీడియో.. టీడీపీ–జనసేన సీట్ల పంపకం!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో టీడీపీ 94, జనసేన 24 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించాయి.
అయితే సీట్లను ప్రకటించి రెండు రోజుల అవుతున్నా రెండు పార్టీల్లోనూ నిరసనలు చల్లారలేదు. ఆయా స్థానాల్లో సీట్లను ఆశించిన రెండు పార్టీల అభ్యర్థులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.
జగ్గంపేట సీటు తనకు దక్కకపోవడంతో జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తన భార్యతో కలిసి ఒక అమ్మవారి దేవాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. జనసేన కనీసం 40 సీట్లలో అయినా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే మరీ ఘోరంగా 24 సీట్లలోనే పోటీ చేయడమేంటని పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడిపోయారని.. అందరిని మోసం చేసే అలవాటున్న చంద్రబాబు.. పవన్ ను కూడా మోసం చేశారని ధ్వజమెత్తుతున్నారు. కమ్మలకు 21 సీట్లు ప్రకటించుకున్న టీడీపీ కాపులకు కేవలం 7 సీట్లను మాత్రమే ప్రకటించిందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. రెండో జాబితాలోనైనా ఎక్కువ సీట్లను జనసేన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అనుకూల మీడియా కూటమిలో అసంతృప్త స్వరాలను, ఆందోళనలను పెద్ద ఎత్తున హైలెట్ చేస్తోంది. వైసీపీ అధికారిక ఎక్స్, ఫేస్ బుక్ ఖాతాలో ఒక వైరల్ వీడియో ఇప్పుడు సందడి చేస్తోంది. టీడీపీ, జనసేన సీట్లు పంపకం పూర్తి కాగానే వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో గత రోజులుగా వైరల్ గా మారింది.
ఈ వీడియో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నటించిన హిందీ సినిమాలోనిది. ఆ సన్నివేశాన్ని ప్రస్తుత టీడీపీ, జనసేన కూటమి సీట్ల పంపకానికి అన్వయిస్తూ వీడియోను ఎడిట్ చేశారు.
అక్షయ్ కుమార్ సినిమాలో హీరో ఒక వ్యక్తిని మోసం చేసి ఎక్కువ డబ్బు సంపాదించే సన్నివేశం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా వీడియో ఎడిట్ చేయబడింది. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి, జనసేనను తక్కువ సీట్లకే పరిమితం చేసిందనే వీడియో వైరల్‌గా మారింది. డబ్బు కట్టలను సీట్లుగా చూపారు. చంద్రబాబును అక్షయ్ కుమార్ స్థానంలో ఉంచారు. మోసపోయిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ను చూపారు. వీడియో చివరలో ఈ మోసంతో పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నట్టు అత్తారింటికి దారేది సినిమాలోని ఒక ఫొటోను జోడించారు.
ఇప్పుడు ఈ వీడియో రెండు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను వైసీపీ శ్రేణులే కాకుండా జనసేన శ్రేణులు కూడా వైరల్ చేస్తుండటం విశేషం.