జనసేన టికెట్లు ప్రకటించేస్తున్న జోగయ్య...పవన్ కంటే స్పీడ్ గా...!

చేగొండి హరి రామజోగయ్య. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పటికి యాభై ఏళ్ల క్రితమే చట్ట సభలలో ప్రవేశించిన వారు

Update: 2024-02-11 03:45 GMT

చేగొండి హరి రామజోగయ్య. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పటికి యాభై ఏళ్ల క్రితమే చట్ట సభలలో ప్రవేశించిన వారు. ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వారు. రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న వారు. కాపుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు ఇపుడు ఆయన వయసు అక్షరాలా 87 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇంత చురుకుగా జోగయ్య రాజకీయంగా ఉంటున్నారు.

ఆయన కాపుల కోసం పనిచేస్తున్నారు. 2004లో కాంగ్రెస్ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రజారాజ్యం పార్టీ కోసం 2008లో తన పదవికి రాజీనామా చేశారు. చిరంజీవిని సీఎం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన చేశారు. ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడంతో ఆయన జనసేన వైపు ఇపుడు ఆశగా చూస్తున్నారు

రేపటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గణనీయమైన సీట్లను తీసుకోవాలని ఆ మీదట అధికారంలో వాటా దక్కించుకుని కాపుల చిరకాల కోరిక అయిన సీఎం పదవిని పవన్ అధిష్టించి వారికి సంతోషం కలుగచేయాలని జోగయ్య కోరుతున్నారు. ఆయన ఇదే అజెండాతో పనిచేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఒక అవకాశంగా మార్చుకోమని ఆయన పవన్ కి చెబుతున్నారు.

ఇదిలా ఉంటే జనసేన ఎక్కడ బలంగా ఉందో లిస్ట్ ఇస్తూ ఆ సీట్లను పొత్తులో భాగంగా కోరమని ఇప్పటికే 58 అసెంబ్లీ నియోజకవర్గాలతో జాబితాను విడుదలా చేసి సంచలనం రేపిన జోగయ్య ఆ మీదట తెలుగుదేశం మీడియాలో వచ్చిన వార్తలను చూసి పవన్ కి బహిరంగంగానే లేఖ రాశారు. తక్కువ సీట్లు ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉందని, అలా చేయవద్దని కూడా కోరారు.

ఇపుడు ఆయన ఏడు పార్లమెంట్ సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరుతూ ఆ జాబితాను రిలీజ్ చేశారు. అభ్యర్ధులతో సహా ఆ జాబితాను జోగయ్య రిలీజ్ చేయడం విశేషం. సామాజిక పరంగా జనసేన పార్టీకి ఈ సీట్లు దక్కాలని ఆయన కోరుతున్నారు. ఈ లిస్ట్ ప్రకారం చూస్తే ఇలా ఉన్నాయి.

విజయనగరంలో గేదెల శ్రీనివాస్, అనకాపల్లి కొణిదెల నాగబాబు/కొణతాల రామక్రిష్ణ/ బొలిశెట్టి సత్యనారాయణ, కాకినాడ సానా సతీష్, నర్సాపురం మల్లినీని తిరుమలరావు, మచిలీపట్నం, వల్లభనేని బాలశౌరి, తిరుపతి వరప్రసాద్, రాజంపేటలో బాలసుబ్రమణ్యం/ఎంవీ రావు అని జోగయ్య లిస్ట్ లో పేర్కొన్నారు.

ఇలా ఈ ఏడు స్థానాల్లో జనసేనకు బలం ఉంది. అంగబలం అర్ధబలం ఉంది. అందువల్ల వీరికి టికెట్లు ఇప్పించుకుని జనసేన బలమైన మిత్రపక్షంగా టీడీపీ కూటమిలో ఉండాలని జోగయ్య అంటున్నారు. మరి ఈ జాబితా మీద పవన్ ఏమంటారో టీడీపీ పొత్తులో వీటి ప్రస్తావన వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News