ఫార్టీ ఇయర్స్ టీడీపీకి 40 నంబర్ తో జనసేన...!?
జనసేనకు ఇరవై దాకా సీట్లు ఇచ్చి నమ్మకమైన మిత్రపక్షంగా చేసుకుని ముందుకు పోవాలని చూస్తోంది అని ప్రచారంలో ఉంది.
తెలుగుదేశం పార్టీ నడి వయసులో పడింది. నలభయ్యేళ్ళు ఆ పార్టీకి నిండాయి. 2024 ఎన్నికలు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అన్నది అందరికీ తెలిసిందే. ఈసారి కనుక టీడీపీ గెలవకపోతే ఇక చాలా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ జనసేన పొత్తు కలిపింది.
జనసేనకు ఇరవై దాకా సీట్లు ఇచ్చి నమ్మకమైన మిత్రపక్షంగా చేసుకుని ముందుకు పోవాలని చూస్తోంది అని ప్రచారంలో ఉంది. తెలుగుదేశం ఎపుడూ కూడా మిత్రులకు పది నుంచి పదిహేను సీట్లు మించి ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో 2009లో మాత్రం టీయారెస్ కి నలభై దాకా సీట్లు ఇచ్చింది. అయితే అపుడు మొత్తం 294 సీట్లు ఉన్నాయి. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. 175 సీట్లు. అందులో నలభై సీట్లు అంటే పెద్ద నంబర్.
కానీ జనసేన ఆ నంబర్ నే కోరుతోంది. పవన్ మదిలో ఏముందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఆయనతో భేటీ అయిన మాజీ మంత్రి హరి రామజోగయ్య పవన్ తో అన్ని విషయాలు ముచ్చటించారు. దాంతో జనసేన గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా నలభై సీట్లు పవన్ కోరబోతున్నారు అని అంటున్నారు.
అయితే జోగయ్య మాత్రం అరవై సీట్లలో జనసేనకు పది వేల దాటి ఓట్లు 2019లో వచ్చాయి కాబట్టి అరవై దాకా సీట్లు కోరమంటున్నారు. అంతే కాదు అప్పటితో పోలిస్తే ఇపుడు జనసేన బలం పెరిగింది కాబట్టి కచ్చితంగా అరవై సీట్లు తీసుకోవడంతో పాటు చెరి రెండున్నరేళ్ళ పాటు చంద్రబాబు పవన్ అధికారం పంచుకోవాలని కూడా కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక పవన్ మదిలో కూడా నలభై సీట్లు తీసుకోవడం అన్న ప్రతిపాదన ఉండడం అంటే అది చిన్న విషయం కానే కాదు. ఎందుకంటే ఈ నంబర్ మొత్తం ఏపీ సీట్లలో నాలుగవ వంతు. అంటే పాతిక శాతం అన్న మాట. ఈ సీట్లలో గెలిచే సీట్లే అన్నీ తీసుకుని అందులో అత్యధిక సీట్లు గెలవాలన్నది పవన్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.
అలా టీడీపీ ఒప్పుకుని పొత్తులో భాగంగా నలభై సీట్లు ఇస్తే కచ్చితంగా టీడీపీకి ఇబ్బంది అవుతుంది అన్న వాదన ఉంది. ఒక వేళ కాదు అనుకుంటే జనసేన పొత్తుకు రాదు అన్న మరో ఇబ్బంది ఉంది. ఏది ఏమైనా నలభై సీట్లు జనసేనకు ఇస్తే ఏపీలో హంగ్ రావడం ఖాయం. కూటమిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్ప సింగిల్ గా టీడీపీకి 88 మార్క్ మెజారిటీ ఫిగర్ రాదు అని అంటున్నారు.
దాంతోనే కాపులు ఇపుడు పట్టు బిగిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఇది డూ ఆర్ డై అని టీడీపీ 2024 ఎన్నికలను చూస్తూంటే ఇదే సీఎం పోస్ట్ ని సాధించేందుకు తగిన సమయం అని కాపులు అంటున్నారు. మొత్తానికి నలభయ్యేళ్ల టీడీపీ ఇపుడు నలభై నంబర్ దగ్గర లాక్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.