తెలంగాణలో జనసేన వద్దు.. ఏపీలో జనసేన కావాలి!

గతకొంతకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల వ్యవహారాలు మొత్తం రాజకీయాలనే భ్రష్టుపట్టిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2023-12-16 11:21 GMT

గతకొంతకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల వ్యవహారాలు మొత్తం రాజకీయాలనే భ్రష్టుపట్టిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీలో టీడీపీ - జనసేన (బీజేపీ లేకుండా).. తెలంగాణలో బీజేపీ - జనసేన (టీడీపీ లేకుండా) జరుగుతున్న పొత్తు రాజకీయాలు తీవ్ర విమర్శలను తెరపైకి తెస్తున్నాయి. ఈ సమయంలో మరోసారి జనసేన, బీజేపీల పొత్తు వ్యవహారంపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీజేపీ చేస్తున్న రాజకీయాలపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. అయితే ఆ ఎనిమిది స్థానాల్లోనూ జనసేనకు డిపాజిట్లు రాలేదు. దీంతో... టి.బీజేపీలో అంతర్లీనంగా పెద్ద చర్చ మొదలైందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... తెలంగాణ బీజేపీ స‌మావేశంలో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డాన్ని ప‌లువురు నాయ‌కులు త‌ప్పు ప‌ట్టారని తెలుస్తుంది. పవన్ కు సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ ఓకే కానీ.. అది రాజకీయాలకు వచ్చేసరికి శూన్యమని స్పష్టంగా చెబుతున్నారంట. ఈ సమయంలో ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై తేల్చి చెప్పారు.

"సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది" అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో... జనసేన బలాబలాలపై బీజేపీ నాయకులు వేసిన ట్రైల్ రన్ సున్నా ఫలితాలు ఇవ్వడంతోనే ఈ నిర్ణయం అని అభిప్రాయాలు తెరపైకి రావడం మొదలయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్రానికే ప‌రిమిత‌మా? లేక ఏపీలో కూడా బీజేపీ - జనసేన పొత్తు ఉండదా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఈ సమయంలో బీజేపీ - జనసేన పొత్తు విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వరి మ‌రోసారి కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఆమె... బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నట్టు జ‌న‌సేన ఎప్పుడూ ప్రక‌టించ‌లేద‌ని అన్నారు. బీజేపీకి జనసేనతో పొత్తు ఉందని బలంగా చెబుతున్నారు.

ఇదే సమయంలో... బీజేపీకి దూరంగా వున్నట్టు జనసేన అధినేత ప‌వ‌న్ ఎక్కడా ప్రక‌టించ‌క‌పోవ‌డం వ‌ల్ల పొత్తు ఉన్నట్టే అని ఆమె చెప్పుకోవడం గమనార్హం. ఒకపక్కేమో టీడీపీ - జనసేనలు పొత్తులో ఇప్పటికే చాలా ముందుకు వెళ్లిపోయాయని అంటున్నారు. సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు సీట్ల సర్ధుబాటు చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని కథనాలొస్తున్నాయి. ఇటీవల కూడా చంద్రబాబు – పవన్ లు భేటీ అయ్యారు

ఇలా ఏపీలో టీడీపీ, జనసేన ఈ స్థాయిలో ముందుకు కదులుతున్నా... జనసేనతో తమ పొత్తు ఉందని పురందేశ్వరి ఏ నమ్మకంతో చెబుతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయానికి టీడీపీ - జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరుతుందనేది ఆమె నమ్మకమో.. లేక, ఎన్నికల సమయానికి పవన్ కల్యాణ్ టీడీపీని వీడి తెలంగణ తరహాలో బీజేపీతో కలిసి పొటీ చేస్తారనే ఆశాభావమో తెలియదు కానీ... తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!

ఇలా తెలంగాణ బీజేపీ నేతలేమో... జనసేనతో పొత్తు వద్దు మొర్రో అని అంటుంటే.. ఏపీలో పురందేశ్వరి మాత్రం జనసేనతో పొత్తు ఉందని చెబుతుండటం చూస్తుంటే... ఈ తరహా రాజకీయాలు ఎలాంటి ఫలితాలను చూస్తాయనేది ఆసక్తిగా మారింది. ఈ తరహా రాజకీయాలకు ప్రజలు ఎలా పరిగణిస్తారనేది మరింత ఆసక్తిగా ఉంది!

Tags:    

Similar News