మనుషుల నుంచి కాంతి: జపాన్ శాస్తవేత్తల పరిశోధన
ఈ కోవలోనే.. జపాన్ శాస్త్రవేత్తలు.. సాధారణ మనుషుల్లో కాంతి కిరణాలు ఉన్నాయని తాజాగా గుర్తించారు.
మానవ శరీరం.. ఊహకు అందని సృష్టి. ఈ విశ్వంలో అంతుచిక్కని అనేక రహస్యాలు ఉన్నట్టుగానే.. మానవ శరీరం కూడా ఒక రహస్యంగానే ఉంది. ఈ శరీరం సంకోచ వ్యాకోచాలు.. అసంకల్పిత ప్రతీకార చర్యలు, హృదయ స్పందనలు ఇలా.. అనేక విషయాలపై అంతుచిక్కని చర్చ శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవలోనే.. జపాన్ శాస్త్రవేత్తలు.. సాధారణ మనుషుల్లో కాంతి కిరణాలు ఉన్నాయని తాజాగా గుర్తించారు.
ప్రతి మానవ దేహం నుంచి చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలలో జరిగే రసాయన ప్రతి చర్యల కారణంగా కాంతి ఉత్పత్తి అవుతుందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి దేహానికి కొన్ని రోజుల పాటు అల్ట్రా సెన్సిటివ్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా.. శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే కాంతిని గుర్తించారు. ప్రకాశ వంతమైన కాంతి.. వ్యక్తి బుగ్గలు, నుదురు, మెడ నుంచి వెలువడుతున్నట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయి.
వేదాల్లో నిర్దారణ!
సనాతన భారతీయ వేదాల్లో జీవుడిలో 'కాంతి' ఉన్న విషయం స్పష్టంగా ఉంది. వ్యక్తి నాభికి ఆరు అంగుళాల పైన అంతర్ముఖమైన 'కాంతి' ఎప్పుడూ వెలుగుతూ ఉంటుందన్నది వేదం చెబుతున్న మాట. దీనిని 'జీవుడు'గా సంబోధిస్తారు. మృత్యువుకు చేరువ అవుతున్న క్రమంలో ఈ కాంతి తగ్గుతూ ఉంటుంది. అందుకే.. ''ముఖంలో కళలేదు''- 'కళా విహీనంగా మారాడు' అనే మాట తరచుగా వినిపించే విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ కాంతినే ఆత్మగా కూడా వేదం చెబుతోంది. దీనికి సంబంధించిన వివరాలు.. రుగ్వేదంలో ఉన్నాయని పండితులు చెబుతారు. అయితే.. శాస్త్రీయంగా ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు నిర్ధారించే దిశగా తొలి అడుగు వేశారు.