పవన్ పై జేడీ ప్రశంసలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై సీబీఐ మాజీ జేడీ, నవ భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై సీబీఐ మాజీ జేడీ, నవ భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటించిన పవన్ నిబద్ధతను పొగుడుతూ ట్వీట్ చేశారు లక్ష్మీనారాయణ. సీబీఐలో పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జేడీ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల ముందు సొంతంగా పార్టీ పెట్టుకున్న లక్ష్మీనారాయణ మిగిలిన నాయకులకు భిన్నంగా ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. పలు టీవీ చానళ్ల డిబేట్లలో పాల్గొంటూ ప్రభుత్వ కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. మంచిని మంచిగా.. తప్పులను తప్పుగా చెబుతూ తనకు అందరూ సమానమే అన్నట్లు వ్యవహరిస్తున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తడం చూస్తే ఆయన జనసేనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గిరిజన గ్రామాల్లో డోలీ మోతల బాధలు తప్పించాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఏజెన్సీలోని 4 వేల తండాలకు రోడ్లు నిర్మించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. 20వ తేదీన సాలూరు నియోజకవర్గం సిరివర వద్ద రూ.9.50 కోట్లతో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. కాలినడకన గిరిజన గ్రామాలకు వెళ్లిన పవన్ కల్యాణ్ గిరిజనుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసిన జేడీ లక్ష్మీనారాయణ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
గిరిపుత్రుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని పవన్ ను కొనియాడిన జేడీ లక్షీ నారాయణ ‘‘రాజ్యాంగంలోని 46, 244, 244ఏ 275(1) అధికరణలు గిరిజనుల హక్కులను పరిరక్షించాలని వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో మీ నాయకత్వం కీలకం కావాలని’’ ఆకాక్షింస్తూ ట్వీట్ చేశారు.