ఇండియన్ వెజ్ కి వాన్స్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవే!
డేటింగ్ లో ఉన్నప్పుడు తాను చేసిన వెజ్ వంటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వాన్స్.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఉపాధ్యక్షుడిగా వాన్స్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా "జో రోగన్ ఎక్స్ పీరియన్స్" అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా భారతీయ శాఖాహార వంటలు.. డేటింగ్ లో ఉన్నప్పుడు తాను చేసిన వెజ్ వంటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వాన్స్.
అవును... అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జేడీ వాన్స్.. భారతదేశపు అల్లుడు అనే సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా భారతీయ శాఖాహార వంటకాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇండియన్ అమెరికన్ అయిన తన భార్య ఉషా వాన్స్ కి ఈ వంటకాలను అద్భుతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన డేటింగ్ ఎక్స్ పీరియన్స్ ని పంచుకున్నారు.
ఇందులో భాగంగా...ఇద్దరూ డేటింగ్ లో ఉన్నప్పుడు ఉష కోసం వాన్స్ ఓ వంటకం చేశారంట. అయితే.. ఆ శాఖాహార భోజనం గురించి చెబుతూ.. అతని మొదటి ప్రయత్నాన్ని అసహ్యకరమైనదిగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జో రోగన్ తో జరిగిన సంభాషణలో... ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా, శాఖాహార వంటల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తొలుత ఈ విషయంపై స్పందించిన రోగన్... ఎవరైనా శాఖాహారం తినాలనుకున్నా.. శాఖాహారులుగా మారాలనుకున్నా.. వారు భారతీయ ఆహారాన్ని తినండి అని ప్రకటించారు. దీనికి 'అవును’ అన్నట్లుగా స్పందించిన వాన్స్... తన భార్య నేపథ్యం, వంట చేయడం, తినడం పట్ల తన విధానాలను పూర్తిగా ఎలా మార్చింది పంచుకున్నారు. ఆమెను కలవడానికి ముందే భారతీయ వంటలపై తనకు బేసిక్ అవగాహన ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా... తన భార్య చేసే శాఖాహారం అసాధారణమైనదని చెప్పిన వాన్స్... ఎవరైనా శాఖాహార జీవన శైలిని స్వీకరించాలనుకుంటే.. కచ్చితంగా భారతీయ వంటకాల వైపే తిరగండి.. ఇది అద్భుతమైన శాఖాహార ఎంపికలను అందిస్తుందని అన్నారు.
కాగా... జేడీ వాన్స్ తన శాఖాహార జీవన శైలిని అవలంభించారని.. తన తల్లి నుంచి భారతీయ ఆహారాన్ని ఎలా వండాలో నేర్చుకున్నారని ఇటీవల ఉషా వాన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇండియన్ వెజ్ ఈజ్ బెస్ట్ అంటూ మరోసారి స్పందించారు వాన్స్!