చంద్రబాబుకు 10ఏళ్లు లేదా లైఫ్... మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఏపీ సీఐడీ శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-10 05:31 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఏపీ సీఐడీ శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. నైపుణ్యాభివృద్ధిపేరిట అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును ప్రధాన నిందితుడిగా ఏపీ సీఐడీ తేల్చింది. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

ఈ సమయంలో చంద్రబాబుపై పెట్టిన సెక్షన్స్, నేరం రుజువైతే ఆయనకు పడే శిక్షపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సెక్షన్ 409పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సెక్షన్ కంటిన్యూ అయ్యి నేరం రుజువైతే చంద్రబాబుకు 10ఏళ్ల జైలు శిక్ష లేదా.. జీవితకాలం జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని తెలిపారు!

అవును... చంద్రబాబును ఏయే సెక్షన్ల కింద అరెస్టు చేశారనే దానిపై పలు ఊహాగానాలు రావడం, ఈ సెక్షన్ ల కింద నేరం రుజువైతే పడే శిక్ష పై చర్చ జరుగుతుంది. దీంతో... ఇదే విషయమై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణను మీడియా ప్రశ్నించింది. దీంతో... సెక్షన్ 409 లెక్కన నేరం రుజువైతే అతనికి 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు విధించవచ్చని ఆయన వెల్లడించారు.

ఇక మిగిలిన సెక్షన్ల లో 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్షకు దారి తీయవచ్చని తెలిపిన ఆయన... అయితే ఆ సెక్షన్ల కింద అరెస్టు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మాజీ జేడీ అభిప్రాయపడ్డారు. కానీ సెక్షన్ 409 ప్రకారం 10 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు జైలు శిక్షకు దారి తీస్తుందని తెలిపారు.

ఇదే సమయంలో... ఇవాళ రిమాండ్ రిపోర్టులో ఏం రాశారన్నది జడ్జి పరిశీలించిన అనంతరం చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించాలా? లేక జ్యుడిషియల్ కస్టడీ విధించాలా? అనే నిర్ణయం తీసుకుంటారని తెలిపిన లక్ష్మీనారాయణ... జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ వెలువడిన వెంటనే చంద్రబాబు హైకోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇదే క్రమంలో... ఇది ఆర్థికపరమైన అంశాలతో కూడిన కేసు కావడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాల్సి ఉంటుందని తెలిపిన లక్ష్మీనారాయణ... ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయం కావడంతో అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని, కారణాలన్నీ రాయాలని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో స్పష్టంగా చెప్పిందని వివరించారు.

Tags:    

Similar News