వ్య‌క్తిగా ఓకే.. రాజ‌కీయ శ‌క్తిగా మాత్రం వీరు మైన‌స్సే...!

కొంద‌రి విష‌యాలు ఆస‌క్తిగా మారుతుంటాయి. వ్య‌క్తులుగా వారికి స‌మాజంలో మంచి పేరు, హుందాత‌నం.. వంటివి ఉంటాయి.

Update: 2024-01-22 00:30 GMT

కొంద‌రి విష‌యాలు ఆస‌క్తిగా మారుతుంటాయి. వ్య‌క్తులుగా వారికి స‌మాజంలో మంచి పేరు, హుందాత‌నం.. వంటివి ఉంటాయి. అంతేకాదు నిజాయితీ ప‌రులుగా కూడా వారు పేరు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ, ఇ లాంటి వారిలో కొంద‌రు.. రాజ‌కీయంగా ముందుకు వ‌చ్చారు. సొంత‌గా పార్టీలు పెట్టుకున్న‌వారు ఉన్నారు. అయితే.. వీరి రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ల‌స్‌ల‌క‌న్నా.. మైన‌స్‌లే ఎక్కువ‌గా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చ‌ర్చ‌గా మారిందంటే.. ప్ర‌స్తుతం ఏపీలో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ పెట్టుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి కూడా సై అంటున్నారు. ఈనేప‌థ్యంలో వ్య‌క్తిగా ఓకే అయినా.. రాజ‌కీయాల్లో మా త్రం శ‌క్తులుగా ఎద‌గ లేకున్న ఇలాంటి వారి విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌తంలో లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ కూడా లోక్‌స‌త్తా పేరుతో రాజ‌కీయాలు చేశారు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. కూక‌ట్‌ప‌ల్లి వంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచివిజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, త‌ర్వాత కాలంలో అస‌లు ఐపు అజా లేకుండా పోయారు.

త‌ర్వాత‌.. చిరంజీవి రాజ‌కీయాలు చేసినా.. తాను గెలిచి 18 మంది గెలిపించుకున్నా.. ప‌ట్టుమ‌ని ఐదేళ్ల‌పా టు కూడా రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌లేక పోయారు. దీంతో రాజ‌కీయంగా ఆయ‌న త‌ప్పుకొని.. సినిమాల‌కు ప‌రిమితం అయ్యారు. ఇక‌, త‌ర్వాత ఈ రేంజ్‌లో రాజ‌కీయాలు చేయాల‌ని కొంద‌రు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా.. భావించినా అనుకున్న విధంగా ముందుకు సాగ‌లేక పోయారు. దీంతో వ్య‌క్తులుగా వారంతా ఓకే అయినా.. రాజ‌కీయ శ‌క్తులుగా మాత్రం వారికి మైన‌స్ మార్కులు ప‌డ్డాయి.

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ స‌హ‌జంగానే రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ల్ల . ఆ వ‌ర్గంలోని మేధావు లు జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీవైపు మొగ్గు చూపుతార‌నే ఒక చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. అయితే.. కామ‌న్ పీపుల్ మాత్రం ఇప్ప‌టికీ ల‌క్ష్మీనారాయ‌ణ అంటే ఎవ‌రు? అనే స్థితిలోనే ఉన్నారు.

ఒక అధికారిగానే ఆయ‌న‌ను చూస్తున్నారు. ఆయ‌న విష‌యంలో రాజ‌కీయాల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం ఇప్ప‌టికీ ఏర్ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సో.. వ్య‌క్తిగా ఆయ‌న ఓకే నే అయినా రాజ‌కీయ శ‌క్తిగా మాత్రం జేడీ మైన‌స్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News