జేడీ ఇక ఇండిపెండెంట్... విశాఖ టార్గెట్...?
అలాగే స్టీల్ ప్లాంట్ లో ఒక విభాగం విషయంలో అమ్మకానికి పెడితే బిడ్ ని దాఖలు చేసి సంచలనం రేకెత్తించారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీ లో చేరేది లేదని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. 2018లో సీబీఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడీ 2019 ఎన్నికల ముందు వరకూ సొంతంగా పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ఆయనకు ఆ ఎన్నికల్లో రెండు లక్షల 80 వేల ఓట్ల వచ్చాయి. ఇది నిజంగా అద్భుతమైన నంబర్. ఈ స్థాయిలో ఓట్లు వచ్చాక ఈసారి మళ్లీ జనసేన నుంచి కానీ మరో ప్రధాన పార్టీ నుంచి కానీ పోటీ చేసి విజయం సాధించాలని ఎవరైనా అనుకుంటారు. కానీ జేడీ అయితే జనసేన నుంచి చాలా కాలం క్రితమే బయటకు వచ్చేశారు. ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది. అలాగే తెలుగుదెశం నుంచి కూడా పిలుపు ఉంది అని అంటున్నారు. ఇక బీజేపీలో చేరమని కోరుతున్న వారు ఉన్నారు.
అయితే ఆయన కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఒక విభాగం విషయంలో అమ్మకానికి పెడితే బిడ్ ని దాఖలు చేసి సంచలనం రేకెత్తించారు. బీజేపీ ఏపీకి చేస్తున్న అన్యాయం విభజన హామీల మీద ఆయన పోరాడుతున్నారు.
దాంతో బీజేపీ నుంచి జేడీ పోటీ చేయరని తేలిపోతోంది. అలాగే బీజేపీకి మద్దతుగా ఉన్న వైసీపీ, టీడీపీ నుంచి పోటీకి ఆయన సిద్ధంగా లేరు అని అంటున్నారు. దాంతో ఆయన నా రూటే ఇండిపెండెంట్ రూట్ అని తేల్చేశారు. తాజాగా ఆయన క్రిష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పారు.
అయితే ఏ ప్రాంతం నుంచి అన్నది ఆయన వెల్లడించలేదు కానీ ఆయన గత నాలుగేళ్లుగా తన కార్యక్షేత్రంగా విశాఖను చేసుకుని చేస్తున్న పోరాటం కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ చూస్తే ఆయన విశాఖ నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారు అని అంటున్నారు.
పైగా విశాఖ కాస్మోపాలిటన్ సిటీ. అక్కడ నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చు. మేధావులు, విద్యావంతులు ఎక్కువ మంది ఉన్నారు దాంతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు, ఉద్యోగులు, ఇతర వర్గాల మద్దతు తనకు దండీగా ఉంటుందని భావిస్తూ జేడీ విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అంటున్నారు. అయితే జేడీ ఇండిపెండెంట్ గా పోటీ పడితే మాత్రం అది ఆయన గెలుపునకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ వైసీపీకి కచ్చితనా రాజకీయ లాభాన్ని తెస్తుందని అంటున్నారు. ఎందుకంటే జేడీ భారీగా ఓట్లు చీల్చడం ఖాయం. అదే జరిగితే మరోమారు విశాఖ ఎంపీ సీటు వైసీపీ ఖాతాలో పడుతుంది అని అంటున్నారు.