హాట్ కామెంట్స్: కామారెడ్డి – రేవంత్ రెడ్డి... మధ్యలో జీవన్ రెడ్డి!
అవును... తాజా రాజకీయ పరిణామాలు, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ, తెలంగాణా ప్రాజెక్టులు మొదలైన విషయాలపై తాజాగా జీవన్ రెడ్డి స్పందించారు.
తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో వరుస చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రచారంలో కూడా అధికార బీఆరెస్స్ కు పోటీగా కాంగ్రెస్ నాయకులు దూసుకెళ్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో మరింతగా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు.. అందుకు అనుగుణంగా ప్రత్యర్థులపై విమర్శలూ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజా రాజకీయ పరిణామాలు, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ, తెలంగాణా ప్రాజెక్టులు మొదలైన విషయాలపై తాజాగా జీవన్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 దశాబ్దల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లు చెక్కు చెదరలేదు కానీ... కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం టూరిస్ట్ స్పాట్ గా మారిందని ఫైరయ్యారు.
ఇదే సమయంలో... గోదావరి వరద ప్రవాహం వస్తే ఇసుక తరలిపోతుందనే పరిజ్ఞానం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని మండిపడిన ఆయన... మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కింద బొగ్గు గనులు ఉన్నాయన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో... ఇంజనీరింగ్ ఆఫీసర్లు, కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టారని ఆరోపించారు.
ఈ సందర్భంగా... చైనా లాంటి దేశాల్లో ప్రాజెక్టులు కుంగితే ఉరి తీసేవారని చెప్పుకొచ్చిన జీవన్ రెడ్డి... సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపంపై న్యాయ విచారణ జరిపించి బాధ్యలును కటకటాల్లోకి పంపిస్తామని తెలిపారు.
అనంతరం... కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం కామారెడ్డే అని చెప్పారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే మొగోడు రేవంత్ రెడ్డి అని.. ముఖ్యమంత్రిని ఓడగొట్టాలని ప్రజలందరూ కసితో ఉన్నారని.. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా... ధరణి అంశంపైనే ఎన్నికలకు సిద్ధమా అని భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలను సవాల్ జీవన్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే... కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు.