దిగిపోతూ పోతూ బైడెన్ దూకుడు.. ఉక్రెయిన్ కు యాంటీ పర్సనల్‌ మైన్స్‌

ఉక్రెయిన్ పై రష్యా దూకుడును తగ్గించాలన్న ఆలోచనో ఏమో కానీ.. బైడెన్ తాజాగా ఆ దేశానికి మరో ప్రమాదకర ఆయుధాన్ని అందించాలని నిర్ణయించారు.

Update: 2024-11-20 08:28 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్నేహితుడైన, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వచ్చేలోగానే చేయాల్సినంత చెండాలం చేసేలా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. సరిగ్గా రెండు నెలలు.. ఈ వ్యవధిలోనే ప్రపంచాన్ని ముంచేసేలా ఉన్నారు. మొన్న ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌) రష్యా పైకి ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చిన బైడెన్.. ఇప్పుడు మరో దుందుడుకు నిర్ణయం తీసుకున్నారు. అసలే.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని చూస్తున్న పుతిన్ కు బైడెన్ ఆయుధాలు అందిస్తున్నట్లయింది.

ఆ ఆయుధం ప్రమాదకరం..

ఉక్రెయిన్ పై రష్యా దూకుడును తగ్గించాలన్న ఆలోచనో ఏమో కానీ.. బైడెన్ తాజాగా ఆ దేశానికి మరో ప్రమాదకర ఆయుధాన్ని అందించాలని నిర్ణయించారు. అవే.. యాంటీ పర్సనల్‌ మైన్స్‌. ఇక్కడ గమనార్హం ఏమంటే.. 33 నెలల యుద్ధంలో అమెరికా ఎన్నో ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇచ్చింది. కానీ, యాంటీ పర్సనల్‌ మైన్స్‌ ను ఇవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. అది కూడా దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చిన ఒక్క రోజులోనే కావడం.

రష్యా ప్రాబల్యం పెరుగుతున్న చోట

ఉక్రెయిన్ ను భౌగోళికంగా రెండుగా చూడాలి. పశ్చిమ భాగం, తూర్పు భాగం. పశ్చిమంలో యూరప్ ప్రభావం ఎక్కువ. తూర్పులో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. రష్యా చాలా భూభాగాన్ని ఆక్రమించింది. దీంతో ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాల్లో యాంటీ పర్సనల్‌ మైన్స్‌ వాడకానికి అమెరికా ఆమోదం తెలిపింది. రష్యాను నిలువరించేందుకు, ఉక్రెయిన్ మరింత భూమిని కోల్పోకుండా ఉండేందుకు ఆ మైన్స్ మెరుగ్గా ఉపయోగపడతాయని అమెరికా ఆలోచిస్తోంది. ఈ మందుపాతరలతో ప్రజలకు ముప్పు తక్కువగా ఉండేలా చూస్తామని ఉక్రెయిన్‌ హామీ ఇచ్చింది.

అవి ట్యాంక్ మైన్స్.. ఇవి పర్సనల్ మైన్స్

ఉక్రెయిన్ ఇప్పటికే అమెరికా ఇచ్చిన యాంటీ ట్యాంక్‌ మైన్స్‌ తో రష్యా యుద్ధట్యాంక్‌ లు, సాయుధ కవచ వాహనాలను ధ్వంసం చేసింది. ఇవి కేవలం యుద్ధ వాహనాలను ధ్వంసం చేయడానికే. మరి.. యాంటీ పర్సనల్‌ మైన్స్‌ అంటే..? ఇవి ప్రజల మధ్యన ఉంచేవి. యుద్ధం ముగిశాక వీటిని భూమిలో నుంచి తొలగించకపోతే.. పేలిపోయి పెద్దఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. హక్కుల సంఘాల విమర్శలకు భయపడే యాంటీ పర్సనల్ మైన్స్ ఇవ్వలేదు. అయితే, అమెరికా వాదన వేరేలా ఉంది. మైన్స్ ప్రజల మధ్యన పేలకుండా వాటంతంటవే నిర్వీర్యం అయ్యేలా టైమ్‌ సెట్‌ చేసుకొనేలా రూపొందించినట్లు చెబుతోంది. బ్యాటరీ ఆధారంగా 4 గంటల నుంచి రెండు వారాల వరకు మాత్రమే యాక్టివ్‌ గా ఉంటాయని పేర్కొంటోంది. బ్యాటరీ జీవితకాలం ముగిశాక సెల్ఫ్ డీ యాక్టివేట్ అవుతాయనిని వెల్లడించింది.

Tags:    

Similar News