బైడెన్ నోట నరమాంస భక్షకుల మాట!
ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే. దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జో బైడెన్ మరోసారి అధ్యక్ష రేసులో నిలిస్తే.. మాజీ అధ్యక్షుడైన ట్రంప్ ఆయనపై పోటీ చేస్తున్నారు. ఈసారి అధ్యక్ష కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్న ట్రంప్.. అందుకు తగ్గట్లే తన ఎన్నికల ప్రచారాన్నిచేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. బైడెన్ విషయానికి వస్తే.. ఆయన తన ఎన్నికల ప్రచారంలో అదే పనిగా తడబుతున్నారు. మెమరీ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఆయన తరచూ విషయాల్ని మర్చిపోతున్నారని.. వయోభారంతో ఆయన మెమరీ మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇదే అంశాన్ని ట్రంప్ తన ప్రసంగాల్లో తరచూ ప్రస్తావిస్తూ.. తనకు బైడెన్ కు మధ్యనున్న తేడాను చెప్పేస్తుండటం తెలిసిందే. తాజాగా బైడెన్ చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు.. ఆయన మెమరీపై కొత్త డౌట్లు తలెత్తేలా మారుతున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం వేళలో తన అంకుల్ ను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి కారణం 1944లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అధికారిక సమాచారం భిన్నంగా ఉండటమే దీనికి కారణం. తాజాగా పిట్స్ బర్గ్ లో మాట్లాడిన బైడెన్.. తన మామయ్య సెకండ్ లెఫ్టినెంట్ ఆంబ్రోస్ జె. ఫినెగన్ జూనియర్ ను పపువా న్యూగినియాలో నరమాంస భక్షకులు తినేసినట్లుగా చెప్పారు.
అయితే.. అధికారిక సమాచారం ప్రకారం బైడెన్ ప్రస్తావించిన అంకుల్ ప్రయాణిస్తున్న విమానంలో 1944లో న్యూగినియా ఉత్తర తీరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆంబ్రోస్ తో పాటు మరో ఇద్దరు కూడా తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. అధికారిక సమాచారానికి భిన్నంగా బైడెన్ మాటల్లో నరమాంస భక్షకుల ఎపిసోడ్ రావటం ఇప్పుడు వైరల్ గా మారింది. బైడెన్ రాజకీయ ప్రత్యర్థులకు మరో ఆయుధం దొరికినట్లైంది.