బైడెన్ టైం అస్సలు బాగోలేదుగా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టైం అస్సలు బాగున్నట్లుగా కనిపించట్లేదు. రెండోసారి అధ్యక్ష రేసులోదిగిన ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి

Update: 2024-07-18 04:52 GMT

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టైం అస్సలు బాగున్నట్లుగా కనిపించట్లేదు. రెండోసారి అధ్యక్ష రేసులోదిగిన ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మీద పడిన వయసు.. అందుకు తగ్గట్టు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల నడుమ.. అధ్యక్ష రేసులోకి అడుగు పెట్టకుండా ఉండాల్సింది.కానీ.. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆశ వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఆశ.. మనలో ఉన్న అసలు సామర్థ్యాన్ని.. సమర్థతను మర్చిపోయేలా చేసి.. ఏమైంది ఓసారి ప్రయత్నించి చూద్దామన్న భావనను కలుగు జేస్తుంది. అదే బైడెన్ ను అధ్యక్ష రేసులోకి వచ్చేలా చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

పాలనా పరంగా బైడెన్ ఫెయిల్యూర్ అన్న భావన ఇప్పటికే విస్తరించిన పరిస్థితి. అందుకు తగ్గట్లే చోటు చేసుకుంటున్న పరిణామాలు బైడెన్ కు ఏ మాత్రం కలిసి వచ్చేలా కనిపించట్లేదు. ఈ మధ్యన ఆయన ప్రత్యర్థి.. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నంతో.. ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పటికే బైడెన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అదే సమయంలో ట్రంప్ నకు కాలం సైతం కలిసి వస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. బైడెన్ టైం ఏ మాత్రం బాగోలేదన్న భావన కలుగక మానదు.

తాజాగా బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. అధ్యక్షుల వారికి స్వల్ప దగ్గు.. జలుబు.. సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రస్తుతం డెలావేర్ లోని సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కొవిడ్ మందులు తీసుకుంటున్నారు బైడెన్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. తనకు అనారోగ్య సమస్యలు ఎదురైతే తాను అధ్యక్ష బరి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అలా చెప్పిన గంటల్లోనే ఆయన కొవిడ్ బారిన పడటం గమనార్హం.

మరోవైపు.. అధ్యక్ష బరిలో నుంచి బైడెన్ తప్పుకోవాలంటూ సొంత పార్టీకి చెందిన నేతలు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా బైడెన్ కు ఇబ్బందికరంగా మారింది. తాజాగా కాలిఫోర్నియా డెమోక్రాటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్ స్పందించారు. ఎన్నికల బరిలో నుంచి బైడెన్ వైదొలగాలని ఆయన కోరుతున్నారు. తాజాగా ఆడమ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించగలరన్నది తనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు.

‘‘పోటీ నుంచి తప్పుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని బైడెన్ మాత్రమే తీసుకోగలరు. వేరొకరికి బాధ్యతలు అప్పగించటానికి ఇదే సరైన సమయం. ఇలా చేయటం వల్ల రాబోయే రోజుల్లో ట్రంప్ ను ఓడించే వీలు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఇదే పెద్ద మనిషి.. తమ పార్టీకి విరాళాలు ఇచ్చే దాతలతో చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉంటే తమ పార్టీ ఓడిపోతుందన్న వ్యాఖ్యను విరాళాలు ఇచ్చే వారితో అన్నట్లుగా ప్రధాన మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.

ట్రంప్ తో జరిగిన ముఖాముఖి చర్చలో బైడెన్ తన ప్రభావాన్ని చూపకపోవటం.. మరోవైపు ఆరోగ్య సమస్యలు.. ఇంకో వైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత బైడెన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇవన్నీ సరిపోనట్లుగా ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేలు సైతం బైడెన్ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా బైడెన్ మాత్రం అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. జులై 11 నుంచి 15 వరకు నిర్వహించిన సర్వేలో ప్రతి పది మంది డెమోక్రాట్లలో ఏడుగురు అంటే.. దగ్గర దగ్గర 65 వాతం మంది బైడెన్ ను మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కేవలం 35 శాతం మంది మాత్రమే ట్రంప్ మీద బైడెన్ గెలిచే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ట్రంప్ తో పోలిస్తే బైడెన్ నిజాయితీపరుడన్న పేరు ఉన్నప్పటికీ.. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవంటున్నారు.

బైడెన్ అభ్యర్థిత్వం పట్ల ప్రజల సంగతిని పక్కన పెడదాం. సొంత పార్టీ నేతల్లోనే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్లు 73 శాతం సానుకూలంగా స్పందిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం తర్వాత ట్రంప్ గ్రాఫ్ విపరీతంగా పెరగటం.. రిపబ్లికన్లు పెద్ద ఎత్తున ట్రంప్ నకు అండగా నిలిచి.. తమ అధికారిక అభ్యర్థిగా డిసైడ్ చేసి.. ప్రకటించేయటం తెలిసిందే. ఇదంతా చూస్తే.. బైడెన్ టైం ఏ మాత్రం బాగోలేదన్న భావన కలుగక మానదు.

Tags:    

Similar News