మచిలీపట్నం రిజిస్ట్రార్ ఆఫీస్ లో జాయింట్ కలెక్టర్ పెళ్లి... వీడియో వైరల్!
ఈమధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిల్లు, వాటికి పెడుతున్న ఖర్చుల సంగతి తెలిసిందే.
ఈమధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిల్లు, వాటికి పెడుతున్న ఖర్చుల సంగతి తెలిసిందే. వీటిలో కొంతమంది జీవితంలో ఒక్కసారి జరిగే సందడి అని అంటుంటే... మరికొంత మంది న్యూసెన్స్ ఆఫ్ వెల్త్ అని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ ఆదర్శ వివాహం చేసుకున్నారు.
హోదాను పక్కనపెట్టి సింపుల్ గా వివాహం చేసుకున్నారు మచిలీపట్నం జాయింట్ కలెక్టర్. అవును... డాక్టర్ అపరాజిత సింగ్ సిన్వర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా... రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అపరాజిత సింగ్ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్ ను వివాహమాడారు.
మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో అపరాజిత - దేవేంద్రకుమార్ లు పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలోనే అపరాజిత - దేవేంద్రకుమార్ లు పరస్పరం దండలు మార్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన దేవేంద్రకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.
ఈ సందర్భంగ అపరాజిత - దేవేంద్ర దంపతులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత అధికారులుగా ఉన్న వ్యక్తులు ఇలా సాధారణంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఏపీ కేడర్ కు చెందిన మరో యువ ఐఏఎస్ ల జంట వివాహం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తిరుపతిలో జరిగిన ఆ వివాహానికి వారి బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్ ఐఏఎస్ కాగా, నవీన్ కుమార్ 2019 బ్యాచ్ ఐఏఎస్.