ఫేస్‌ బుక్‌ లైవ్‌ తెచ్చిన తంటా.. ఆ మహిళా ఎమ్మెల్యేకు సీటు పాయే!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో విడత అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం తాజాగా ప్రకటించింది

Update: 2024-01-19 04:37 GMT

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో విడత అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం తాజాగా ప్రకటించింది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించగా, నాలుగో జాబితా విడుదలయింది. నాలుగు జాబితాల్లో కలిపి 10 లోక్‌ సభా, 58 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

కాగా నాలుగో విడతలో మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇందులో ఎనిమిది స్థానాలు ఎస్సీలవే కావడం గమనార్హం. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఫేస్‌ బుక్‌ లైవ్‌ వీడియోతో కలకలం సృష్టించిన అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సీటు నిరాకరించారు.

2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి.. శింగనమల ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణి శ్రీపై పద్మావతి విజయం సాధించారు. జొన్నలగడ్డ పద్మావతి ఉన్నత విద్యావంతురాలు. పీజీ చేశారు. అంతేకాకుండా ఆమె భర్త ఆలూరి సాంబశివారెడ్డి ఏపీ విద్యా శాఖకు ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. జగన్‌ కు అత్యంత సన్నిహితుడిగా సాంబశివారెడ్డి పేరు పొందారు.

కేవలం అనంతపురం జిల్లా శింగనమలలోనే కాకుండా అనంతపురం జిల్లాలోనే కీలక నేతల్లో ఒకరిగా ఆలూరి సాంబశివారెడ్డి చక్రం తిప్పుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతికే సీటు తెచ్చుకోలేకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కొద్ది రోజుల క్రితం జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌ బుక్‌ లైవ్‌ వీడియో వల్లే సీటు దక్కలేదని ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలో పద్మావతి చేసిన వ్యాఖ్యలు నేరుగా తాడేపల్లిలోని వైసీపీ అధిష్టానాన్ని తాకాయని అంటున్నారు. నియోజకవర్గంలో ఒక్క పని కూడా పూర్తి కావడం లేదని.. ప్రతి పనికీ సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)ను సంప్రదించాల్సి వస్తుందని పద్మావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే తన నియోజకవర్గానికి నీరు కూడా ఇవ్వడం లేదని.. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉందని పద్మావతి ఫేస్‌ బుక్‌ లైవ్‌ వీడియోలో కలకలం రేపారు.

పద్మావతి వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె తర్వాత తన మాట మార్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. అంతేకాకుండా జగన్‌ ఆదేశాలతో తాడేపల్లికి వచ్చి సీఎంను కలిసి వివరణ ఇచ్చుకున్నారు.

ఇదంతా జరిగిన కొద్ది రోజులకే పద్మావతికి వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరిస్తూ జగన్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శింగనమల నుంచి వీరాంజనేయులుకు సీటిచ్చారు. ఈ వీరాంజనేయులు.. పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డికి అనుచరుడే కావడం గమనార్హం.

కాగా 2014 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ అభ్యర్థిగా శింగనమల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యామినీ బాల చేతిలో కేవలం 4,584 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి పద్మావతి విజయం సాధించారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని అన్ని ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక పద్మావతికి ఎక్కడా సీటు లేనట్టేనని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News