చంద్రబాబు కూటమికి జేపీ ఫుల్ సపోర్ట్...!
ఆ ఎన్నికల్లో లోక్ సత్తా ఉమ్మడి ఏపీ అంతటా పోటీ చేస్తే ఆయన ఒక్కరే గెలిచారు.
జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా అధినేత. మేధావిగా ఆయనకు పేరుంది. ఆయన 2009లో ఉమ్మడి ఏపీలో కూకటిపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో లోక్ సత్తా ఉమ్మడి ఏపీ అంతటా పోటీ చేస్తే ఆయన ఒక్కరే గెలిచారు. ఆ తరువాత ఆయన 2014లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఇక ఆ తరువాత ఆయన పోటీ చేయలేదు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జేపీ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూంటారు. డిబేట్లలో పాలుపంచుకుంటారు. ఆయన రాజకీయ సంస్కరణల మీద పాలనా సంస్కరణల మీద ఎక్కువగా మాట్లాడుతూంటారు.
ఆయన జగన్ ప్రభుత్వం విద్యా వైద్య రంగంలో తెచ్చిన కొన్ని మార్పులు చేస్తున్న అభివృద్ధిని గతంలో మెచ్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా జేపీ తన మద్దతు ఏపీలో టీడీపీ కూటమికే అని అంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష కూటమి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు.
టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఇక బయట నుంచి మద్దతు ఇస్తున్న పార్టీగా లోక్ సత్తా ఉంది. ఏపీ ఎన్నికల్లో లోక్ సత్తా పోటీ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఇపుడు పోటీ చేస్తుందా లేదా అన్నది తెలియలేదు కానీ తన సపోర్ట్ ఉందని జేపీ స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. దీంతో ఆయన మద్దతు కూడా కూటమికి లభించినట్లు అయింది. లోక్ సత్తాకు అర్బన్ ప్రజలలో కొంత పేరు ఉంది. వారంతా లోక్ సత్తా అధినేత జేపీ అభిమానులుగా ఉంటున్నారు. ఆయన టీవీ డిబేట్లను కూడా చాలా మంది చూస్తూంటారు.
అరబన్ ఓటర్లలో జేపీ నిర్ణయం ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అలాగే చదువరులు మేధావులలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యత కలిగిన అందరు వ్యక్తులు, సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జేపీ తమ కూటమికి మద్దతు ఇవ్వడాన్ని ఆయన మనస్పూర్తిగా స్వాగతించారు. మొత్తానికి చూస్తే కూటమిలో ఉన్న పార్టీలతో పాటు బయట పార్టీల మద్దతు కూడా దక్కుతోంది. అదే విధంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు వేరే కూటమిగా ఉన్నా కొత్తగా పార్టీ పెట్టినమాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కానీ వైసీపీ అధికారమోకి రాకూడదని కోరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ ఒంటరి పోరు సాగిస్తోంది అని అర్ధం అవుతోంది. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.