మధ్యాహ్నం భోజనం విషయంలో లోకేష్ కీలక నిర్ణయం.. అదే కారణం!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-04 06:48 GMT

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజు ఏమి కూరలు వండాలనే విషయంపై వీక్లీ మెనూ ఇచ్చీ.. స్కూలు పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. ఈ సమయంలో.. ఈ పథకంపై మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అవును... మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా... 2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకూ ఈ పథకం ఉండేదని.. దానివల్ల అప్పట్లో కాలేజీల్లో హాజరు గణనీయంగా పెరిగిందని తెలిపారు. అయితే.. 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసిందని.. అయితే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పదోతరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని.. అయితే, గవర్నమెంట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంత తగ్గించే అవకాశం ఉందని చెప్పిన మంత్రి లోకేష్... 'సంకల్ప్' ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి.. లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టెకర్లుగా నియమించాలని అన్నారు.

దీనితో పాటు కాలేజీల్లో దెబ్బతిన్న బిల్డింగులకు మరమ్మత్తులు చేపట్టాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న తల్లితండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించాలని.. ఆ సమావేశాలను సీఎం చంద్రబాబుతో పాటు తానూ హాజరవుతానని వెల్లడించారు. ఈ సమావేశాలు పండుగ వాతావరణంలో జరగాలని తెలిపారు.

ఈ సందర్భంగా... విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని.. విద్యార్థులకు జపనీస్ విధానంలో జీవన నైపుణ్యాలు అలవరిచేలా చర్యలు తీసుకోవాలని.. పాఠశాల ఆవరణల్లో ఉద్యోగ మేళాలకు మినహా ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతి ఇవ్వకూడదని లోకే

ష్ సూచించారు.

Tags:    

Similar News